తమిళ స్టార్ హీరో సూర్య-జ్యోతిక దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సేవారంగంలో ముందుండే ఈ జంట మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. తమిళనాడులోని ఇరులర్ గిరిజన తెగ సంక్షేమానికి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి చెక్కు అందజేశారు. రిటైర్డ్ జస్టిస్ కె.చంద్రు, పలంకుడి ఇరులర్ ట్రస్ట్ సభ్యులు ఆ విరాళాన్ని అందుకున్నారు.
సూర్య హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘జై భీమ్’ నేడు (సోమవారం) విడుదల కానుంది. తమిళనాడులోని 1990ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్రం కొనసాగుతుంది. గిరిజన తెగకు చెందిన సెంగ్గెని, రాజా కను అనే దంపతుల కథతో తెరకెక్కింది. అన్యాయంగా జైలుపాలైన భర్తను కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ఈకథా నేపథ్యం. న్యాయం చేసే న్యాయవాది పాత్రలో హీరో సూర్య నటించారు ఆయనకు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా రావు రమేష్ నటించారు.