తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రముఖ తెలుగు నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఓ సినిమా వేడుకలో పాల్గొన్న ఆయనను మీడియా ప్రతినిధి ఒకరు అడగ్గా ఈ విషయంపై తమ స్పందనను తెలియజేశారు.
తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పటి నుంచే పరిశ్రమలోని ఎక్కువమంది ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఉంటున్నారని సురేశ్ బాబు అన్నారు. మాలోనూ కొంతమంది ఏదైనా పార్టీకి మద్దతుగా ఉంటారని, కానీ పరిశ్రమ నుంచి మాత్రం మేము ఎలాంటి ప్రకటన చేయబోము, ఇది చాలా సున్నితమైన అంశం అన్నారు.
ఎవరైనా ఒక నాయకుడిని అభిమానించడం.. అభిమానించకపోవడం అనేది సొంత అభిప్రాయం. ఏపీ-తెలంగాణ ఉద్యమం సమయంలోనూ సినిమా పరిశ్రమ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని సురేష్‌బాబు సూచించారు.
మేము రాజకీయ నాయకులం కాదని.. అలాగే మీడియా కూడా కాదు.. కేవలం సినిమాలు చేసేవాళ్లం కాబట్టి అవే చేసుకోవాలి అన్నారు సురేష్‌బాబు. రాజకీయాల్లో రోజూ ఏదో ఒకటి జరుగుతుంది.. అలాంటి వాటిపై ఏం ప్రకటన చేస్తాం.. నా వరకు వస్తే రాజకీయాలకతీతంగా ఉంటాను. పరిశ్రమలో రాజకీయాలు ఉండకూడదనేది నా అభిప్రాయం అన్నారు.