బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ముంబై పోలీసులను దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పాటు సీబీఐ విచారణకు సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం న్యాయబద్దమైనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ జస్టిస్ హృషికేశ్ రాయ్ ఇచ్చిన తీర్పును సుశాంత్ కుటుంబసభ్యులు స్వాగతించారు.
కాగా (జూన్ 14న) సుశాంత్ తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసుపై సీబీఐ విచారణకు బిహార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బిహార్ సీఎం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. అయితే, ఈ కేసులో తనపై పట్నాలో దాఖలైన కేసు విచారణను ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడలేదని, హత్యకు గురయ్యారంటూ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఆరోపిస్తున్నారు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. రియా, ఆమె కుటుంబం తన కుమారుడ్ని మోసం చేసిందని, ఆర్ధికంగా, మానసికంగా వేధించారని ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఒక్కక్కరూ బయటకు వస్తున్నారని, వారికి భద్రత కల్పించాలని సుశాంత్ సింగ్ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లు వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిజాలు బయటపెట్టేందుకు చాలామంది సాక్ష్యులు ఉన్నారని, వారు ప్రాణ భయంతో బయటకు రావడం లేదన్నారు. కాబట్టి ఇప్పటికే ముందుకు వచ్చిన సాక్ష్యులకు భద్రత కల్పించాలన్నారు.