దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రముఖ దర్శకుడు, నటుడు లారెన్స్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ సహకరించారు. ఈ విషయంపై లారెన్స్ విడుదల చేసిన ప్రకటనలో ”కరోనా సహాయ నిధి కోసం రూ.3 కోట్లు ప్రకటించిన తర్వాత సినీ రంగంలోని పలు సంఘాల నుంచి నాకు ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. సహకరించాలని, ఆదుకోవాలని పలువురు కోరారు. ఆ తర్వాతే పంపిణీదారులకు రూ.15 లక్షలు, నడిగర్ సంఘానికి రూ.25 లక్షలు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.25 లక్షలు ఇచ్ఛా దాదాపు రూ.4 కోట్ల వరకు సహాయ నిధి అందించా”
”హిందీలో తెరకెక్కుతున్న ‘లక్ష్మీబాంబ్’ సినిమాకు రావాల్సిన చివరి విడత మొత్తాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి పంపించాలని నిర్మాతను కోరాను. వారు కూడా అంగీకరించారు. ఇప్పుడు కూడా పలు లేఖలు, ఫోన్లు వస్తున్నాయి. కడుపు నింపుకోవడానికి సరకులు లేక ఇబ్బంది పడుతున్నామని, పిల్లలు, వృద్ధులు కష్టాలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అందువల్ల వారికి వస్తువుల రూపంలో సాయం చేయాలని నిర్ణయించుకున్నా. అందులో భాగంగానే ఇతరుల నుంచి సహాయాన్ని కోరాను”
”తొలిసారి సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించి 100 బస్తాల బియ్యం పంపించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే కమల్, అజిత్, విజయ్, సూర్య, ఇతర నటులు, రాజకీయ నేతలు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. చిన్న సహాయమైనా ఈ సమయంలో పెద్ద అండగా ఉంటుందని” పేర్కొన్నారు.