ప్రముఖ సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 31 మే 1942లో కృష్ణ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. కృష్ణ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. అది చూసిన కృష్ణ సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నారు. దీంతో ఆయన సినీ రంగానికి వచ్చేశారు. 1965లో ఆయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి రమేశ్ బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. ఆ తర్వాత విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.