సినీ గాయని సునీత భర్త రామ్ వీరపనేని వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మ్యాంగో పేరుతో ఒక డిజిటల్ మీడియా కంపెనీని ఆయన నిర్వహిస్తున్నారు. తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ కొని వాటిని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సంస్థ విడుదల చేస్తుంటుంది. అయితే, ఓ సినిమాలో గౌడ మహిళలను ఇబ్బందికంగా చూపించారంటూ ఆయన కార్యాలయానికి వెళ్లి ఆయనతో గౌడ సంఘాలకు చెందిన కొందరు నేతలు గొడవ పడ్డారు. తాజాగా ఈ వివాదంతో రామ్ సంస్థ అధికారికంగా స్పందించింది.
ఈ నెల 24న తాము గౌడ కులానికి చెందిన వాళ్లమంటూ కొందరు వచ్చారని… ఒక సినిమా గురించి అభ్యంతరాలను వ్యక్తం చేశారని… ఆ కంటెంట్ ను యూట్యూబ్ నుంచి తొలగించాలని వారు కోరారని రామ్ సంస్థ ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సినిమా అప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ తో థియేటర్లలో విడుదలైందని… అయినప్పటికీ స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం తమకు లేనందున వారు చెప్పిన రోజునే దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించామని పేర్కొంది. ఈ వీడియో కారణంగా ఎవరి మనోభావాలనైనా పొరపాటున నొప్పించి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నామని చెప్పారు.