ప్రముఖ సినీ నటుడు సుమన్.. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ‘బాహుబలి’ సినిమాలో ‘ప్రభాస్’ హీరో కాదని అంటున్నారు. ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి, ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’ గురించి మాట్లాడారు. ‘బాహుబలి’ సినిమాలో అసలైన హీరో ప్రభాస్ కాదు.. రానా. మీరు గమనించినట్లైతే క్లైమాక్స్‌లో ప్రభాస్ టచ్ చేయకుండానే రానా పాత్ర మంటల్లో పడి చనిపోతుంది. దీన్ని బట్టి చూస్తే సినిమా చివరి వరకు రానాదే పవర్‌ఫుల్ పాత్ర. సినిమాలో ఓ విలన్ పాత్రను చంపడం అంత సులువు కాదు. ఆ సన్నివేశాన్ని చూపించడానికి దైర్యం కావాలి. అది కేవలం రాజమౌళికే సాధ్యమైంది. క్లైమాక్స్ వరకు ఓ హీరో 40 మంది రౌడీలను కొట్టడంలో పెద్ద విషయం ఏమీ లేదు’ అని అన్నారు సుమన్.
2015లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత 2017లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ విడుదలైంది. ఈ సినిమాకు భారత్‌లోనే కాదు చైనా, జపాన్‌లోనూ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు చెందిన దర్శక, నిర్మాతలు కూడా తెలుగు సినిమాను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఇక్కడి సినిమాలను ఎంచుకుని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.