‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రకాశ్ రాజ్ ను నాన్ లోకల్ అంటూ కొందరు ఆరోపించడం పెద్ద చర్చకే దారి తీసింది. దీనిపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. భారతదేశంలో పుట్టిన పౌరులందరూ లోకలేనని వ్యాఖ్యానించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అమీర్‌పేటలోని అస్టర్‌ప్రైమ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యుల గొప్పతనం గురించి మాట్లాడిన ఆయన పరోక్షంగా ‘మా’ ఎన్నికల వ్యవహారం గురించి స్పందించారు.
దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకల్ కిందే లెక్కని.. కాబట్టి అందరూ కలిసి కట్టుగా ఉండాలని.. లోకల్-నాన్‌లోకల్ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. అలాగే వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదని ఆయన తెలిపారు. తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సుమన్ పరోక్షంగా మద్దతు ప్రకటించారు.