ప్రముఖ నటి సుమలత.. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన జవాను కుటుంబానికి భూమి ఇస్తానని అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అదిల్ అహ్మద్ దర్ అనే ఉగ్రవాది సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులంతా ఉగ్రదాడిని ఖండిస్తూ ట్వీట్లు చేశారు. అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ తదితరులు ఆర్థిక సాయం ప్రకటించారు.
కర్ణాటకలోని మాండ్యకు చెందిన గురు అనే వీర జవాను అంత్యక్రియలకు భూమి ఇస్తానని సుమలత తొలుత అన్నారు. మాండ్య ఆడబిడ్డగా ఇది తన బాధ్యతని తెలిపారు. సుమలత ప్రస్తుతం తన కుమారుడు అభిషేక్‌తో కలిసి మలేషియాలో ఉన్నారు. అభిషేక్ అరంగేట్ర చిత్రం షూటింగ్ నిమిత్తం వారు విదేశానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సుమలత మాట్లాడుతూ.. ‘గురు అంత్యక్రియలు నిర్వహించడానికి స్థలం కేటాయింపులో ఏవో ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలిసింది. జవానుగా అతని త్యాగానికి గొప్పగా వీడ్కోలు చెప్పడమే మనం ఇచ్చే గౌరవం. అందుకే జవాను కుటుంబానికి అర ఎకరం భూమి ఇవ్వాలని నేను, అభిషేక్ నిర్ణయించుకున్నాం. అక్కడ అతని అంత్యక్రియలు నిర్వహించి, స్మారక చిహ్నాన్ని నిర్మించొచ్చు’ అని సుమలత చెప్పారు.
ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం గురు అంత్యక్రియలు నిర్వహించిందని తెలుసుకున్న సుమలత మలేషియా నుంచి వచ్చిన తర్వాత జవాను కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. అనుకున్న విధంగానే అర ఎకరా భూమికి సంబంధించిన పట్టాని గురు కుటుంబ సభ్యులకు అప్పగిస్తానని అన్నారు. సుమలత భర్త, ప్రముఖ నటుడు అంబరీష్ ఇటీవల కన్నుమూశారు. అంబరీష్ మాండ్య జిల్లాలో జన్మించారు. మాండ్య నుంచి మూడు సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు దగ్గర అయ్యారు.