మెగా హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఉప్పెన’. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలౌతుందా.. అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న బుచ్చిబాబు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు. సుకుమార్ దగ్గర రంగస్థలం సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఉప్పెన సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందన్నాడు బుచ్చిబాబు.
‘నేను బేసిక్ థీమ్ లైన్‌ను సుకుమార్ కు వినిపించాను. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. స్టోరీ లైన్ ను డెవలప్ చేయాలని నాతో చెప్పారు. కథ రాయడానికి ఆరు నెలలు సమయం పట్టింది. ఆ తర్వాత మళ్లీ సుకుమార్ దగ్గరకు వెళ్లి కథ వినిపించాను. కథ విన్న వెంటనే సుకుమార్ నన్ను ఆప్యాయంగా హత్తుకుని… తనకు పుత్రోత్సాహం లాంటి భావన కలుగుతుందని నాతో అన్నారు. సుకుమార్ తో పనిచేయడం అద్భుతమైన అనుభవం. ఇతరులకు క్రెడిట్ ఇచ్చే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. బుచ్చిబాబు లేకుంటే రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర లేనే లేదని సుకుమార్ చెప్పడం ఆయన గొప్ప మనసుకు ఉదాహరణ. నేను కూడా సుకుమార్ పాత్ర ఆధారంగా ఓ కథ రాసుకున్నానని’ చెప్పుకొచ్చాడు బుచ్చిబాబు.