తెలుగు సినిమాను దశబ్ధాల పాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తరువాత ‘ఖైదీ నెంబర్ 150’తో వెండితెరపై దర్శనమిచ్చారు. కమ్ బ్యాక్ లోనూ కొత్త రికార్డులు సృష్టించి కలకలం రేపారు మెగాస్టార్. ఈ సంధర్భంగా ఆయనను రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు.
‘ఆత్మీయ వేడుక’ పేరుతో గురువారం సాయంత్రం పార్క్ హయ్యత్ తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, వినాయక్, అల్లు అరవింద్ అలానే టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
”తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత వచ్చినా.. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150వ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడం.. వారం రోజుల్లోనే 100కోట్లకి పైగా వసూళ్లను అందుకోవడం ఆయన స్టామినాకి నిదర్శనం. 20 ఏళ్ల క్రితం ఆయన ఎలా ఉన్నారో.. ఇప్పుడు అలా ఉన్నారు.
చిరంజీవితో గతంలో ‘స్టేట్ రౌడీ’ సినిమా చేశాను. అలాగే నిర్మాతగా 14 సినిమాలు చేశాను. అందులో మల్టీస్టారర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఒక భారీ సినిమాను తెరకెక్కిస్తానని, అశ్వనీదత్ అందులో భాగస్వామి అవుతారని” టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు.