విశాఖనగరంలోని ఆర్ ఆర్ వెంకటాపురం ప్రాంతంలో.. ఎల్‌జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువు నిద్రమత్తులో ఉన్న వారి ప్రాణాలు తీసింది. మరికొందరిని తీవ్ర అస్వస్థతకుగురి చేసింది. గ్యాస్ ప్రభావానికి రహదారిపై ఎక్కడిక్కడ చెల్లా చెదురుగా అపస్మారక స్థితిలో పడిపోయిన వారిని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఒక్కసారిగా పరుగులు తీశారు. కన్నబిడ్డలు కళ్లెదుట ఊపిరాడక విల్లవిల్లాడుతుంటే చూసి కన్నీరుమున్నీరవడం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు వారి తల్లిదండ్రులు. అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. గ్రామాల్లోని చెట్లన్నీ గ్యాస్ తీవ్రతకు మాడిపోయాయి. మూగ జీవాలన్నీ నేలకొరిగాయి. ఆ ప్రాంతంలో…..ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.