Homeతెలుగు Newsకేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాల ఢీ

కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాల ఢీ

15 2

కేంద్రదర్యాప్తు సంస్థల దాడులు చేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిఘటించడం ఇలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వజమెత్తుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయాలు తూట్లు పొడుస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాల్లో ఎవరు గొప్ప.. మనల్ని పాలించేంది కేంద్రమా.. రాష్ట్రమా? అటు కేంద్రం పెత్తనం చేస్తోంది.. ఇటు రాష్ట్రం కూడా చట్టాలు చేసి నెత్తిన వేస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే మనది యూనియన్ ఆఫ్ స్టేట్. అనగా మన దేశం రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాలన్నీ వేరుగా ఉన్నా వాటిపై కేంద్రం కూడా ఉంటుంది. రాష్ట్రాలు ఎవరి పాలన వారు చూసుకున్నా.. కేంద్రం మొత్తంగా దేశం పాలన చూసుకుంటుంది.

ప్రపంచంలో సమాఖ్య విధానానికి అమెరికన్ రాజ్యాంగం చక్కటి ఉదాహరణ. ఏక కేంద్ర విధానానికి బ్రిటన్ ఆదర్శంగా చెబుతారు. ఈ రెండు రాజ్యాంగాలనుంచి తీసుకొచ్చి సమ్మిళితంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థ ఇప్పుడు వివాదాలకు కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆధిపత్య ధోరణికి ఆలవాలంగా మారింది. సమాఖ్య విధానానికి 3 లక్షణాలుంటాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్దిష్ఠమైన అధికార విభజన ఉంటుంది. దృఢమైన లిఖిత రాజ్యాంగం, కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలుతలెత్తినప్పుడు పరిష్కరించడానికి ఓ ఉన్నత న్యాయస్థానం కూడా ఉంటుంది. మన సమాఖ్య భారతంలో ఈ మూడూ ఉన్నాయి. ఈ 3 ఉన్నంతమాత్రాన భారత దేశం పూర్తి సమాఖ్య కాదని ఎన్నోసార్లు, ఎన్నోఘటనల్లో రుజువవుతూ వస్తూనే ఉంది.

కోల్‌కతాలో జరుగుతున్న మోడీ వర్సెస్ దీదీ పోరాటమే ప్రత్యక్ష సాక్ష్యం. శారదాచిట్‌ఫండ్ స్కాం కేసులో బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు కమిషనర్ రాజీవ్‌ కుమార్ నాయకత్వం వహించారు. ఆయన్ను ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను బెంగాల్ పోలీసులు అరెస్ట్‌ చేయడం, కోల్‌కతా సీబీఐ కార్యాలయాన్ని బెంగాల్ పోలీసులు చుట్టుముట్టడం ఆతరువాతి పరిణామాలు దేశంలో సంచలనంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆజ్యం పోశాయి. ఈ ఘటన జరిగిన వెంటనే మమతా బెనర్జీ బెంగాల్ కమిషనర్ ఇంటికి వెళ్లి మరీ సంఘీబావం తెలిపారు. ఆపై అక్కడే అర్ధరాత్రి దగ్గర్లో ఉన్న మెట్రోథియేటర్ వద్ద దీక్షకు దిగారు. అవసరమైతే బడ్జెట్‌ కూడా అక్కడి నుంచే ప్రవేశపెడతానని సవాల్ విసిరారు. కేంద్రం ఏం చేసినా తగ్గేది లేదని తేల్చి చెప్పారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను అరెస్ట్‌ చేయడం దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా జరగలేదు. ఇలా ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి కేంద్రం తీరును ఎండగట్టడం జరగలేదు. బెంగాల్‌లో రాజీవ్‌ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలుచేసి ఉంటే కేంద్రానిది పైచేయి అయ్యి ఉండేది. కానీ మమతా బెనర్జీ అందుకు అవకాశం ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ సీపీ రాజీవ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. కేంద్రం ఇలాగే తోకజాడిస్తే తమ రాష్ట్రం కేంద్రానికి పన్నులు కట్టదని హెచ్చరించారు. ఇలా దీదీ చేస్తున్న దీక్షకు దేశంలో 22 పార్టీలు మద్దతు పలికాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతీయ పార్టీల నేతలు కోల్‌కతా వెళ్లి ఆమెకు సంఘీభావం తెలిపారు.

బెంగాల్ పరిణామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నగిల్లుతున్న సంబంధాలకు అద్దం పడుతున్నాయి. అటు బెంగాల్, ఇటు కేంద్ర ప్రభుత్వాలు ఎవ్వరూ వెనక్కి తగ్గేందుకు సిద్ధంగాలేరు. ఎవరి పంతం వారు నెగ్గించుకున్నారు. రాజీవ్‌ కుమార్‌ను ప్రశ్నించేందుకు అవకాశమివ్వాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెంగాల్ ప్రభుత్వం కూడా తమ అధికారిని అరెస్ట్‌ చేయకూడదంటూ సుప్రీంకోర్టులో ఆదేశాలు తెచ్చుకుంది. ఆదివారం రాత్రి మొదలైన మమతా దీక్షకు ప్రాంతీయ పార్టీల నేతలు భారీగా వచ్చి మద్దతుతెలిపారు. మంగళవారం సాయంత్రం దీక్ష విరమించే వరకూ కేంద్రానికి, బెంగాల్‌కు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. బెంగాల్‌లో రాష్ట్ర పతి పాలన విధిస్తాం జాగ్రత్త అని కమలనాథులు హెచ్చరిస్తే.. కేంద్రానికి ఒక్క రూపాయి కూడా పన్నులు కట్టను ఏం చేస్తారని దీదీ హుంకరించారు. మొత్తంగా బెంగాల్ పరిణామాలు బలహీనంగా ఉన్న కేంద్ర, రాష్ట్రాల సంబంధాలను తెగతెంపులు చేసుకునే దిశగా లాగాయన్నది కాదనలేని నిజం.

ఒక్క బెంగాల్ ప్రభుత్వమే కాదు.. చాలా రాష్ట్రాలు మోడీ ప్రభుత్వంపై ఆగ్రహంగానే ఉన్నాయి. కేంద్రం తీరును నిరసిస్తూ ఏడాది కాలంగా టీడీపీ పెద్ద పోరాటమే చేస్తోంది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న 16 పార్టీలు గడిచిన నాలుగున్నరేళ్లలో కూటమి నుంచి బయటకు వచ్చాయి. ఆఖరికి కేంద్రం తీరుపై ఎన్డీయే పార్టీలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ఈ పరిణామాలు దేనికి దారి తీస్తాయోనన్నదే సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న.

Recent Articles English

Gallery

Recent Articles Telugu