ప్రపంచంలోనే అతి పెద్ద అడవి అమెజాన్ గత కొన్ని రోజులుగా కాలి బూడిదవుతోంది. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన ఈ అడవుల్లో కార్చిచ్చు రేగి దగ్ధం అవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, తక్కువ మొత్తంలోని ఆర్థ్రత వల్ల ఈ సమయంలో అక్కడ కార్చిచ్చు రగులుకోవడం సాధారణమే అయినా.. ఈ సారి రికార్డు స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయి. ఈ తీవ్రతను శాటిలైట్ చిత్రాల్లో బంధించి నాసా సోషల్‌మీడియాలో షేర్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లతోపాటు సినీ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు.
హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో, బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అక్షయ్ కుమార్ ఇప్పటికే ట్వీట్లు చేశారు. గత 15 రోజులుగా అడవి కాలిపోతూ.. ఇంత నష్టం జరుగుతుంటే దానిపై మీడియా కవరేజ్ తక్కువ స్థాయిలో ఉందని, దీనికి కారణం ఏంటని ప్రశ్నించారు. మహేష్‌బాబు, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, అనుష్క శర్మ తదితరులు కూడా సోషల్‌మీడియాలో అమెజాన్ అడవులు దగ్ధం అవుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.
మహేష్‌బాబు: అమెజాన్ అడవుల దగ్ధం వార్త నన్నెంతో బాధించింది. మన గ్రహానికి ఊపిరితిత్తులుగా వీటిని పిలుస్తాం. ప్రపంచానికి లభించే 20 శాతం ఆక్సిజన్ ఈ అడవులే ఇస్తున్నాయి. భూగ్రహం ఊరికే వచ్చింది కదా.. అని వృథా చేసే వారు ఇకనైనా మేల్కోవాలి. జాగ్రత్తగా వాడుకోవాలి. భూమికి ఊపిరితిత్తులతో సమానమైన అడవులు కాలిపోతున్నాయి, జీవవైవిధ్యం దెబ్బతింటోంది. మన భూమిని కాపాడుకోవడానికి మనవంతు కృషి చేయాలి. ఒకడుగు ముందుకు వేసి.. చెట్లను నాటుదాం. ఈ మార్పు ఇంటి నుంచే రావాలి.
అల్లు అర్జున్: ప్రపంచంలోని అతి పెద్ద అడవులు, మనకు 20 శాతం ఆక్సిజన్ అందించే అడవులు, పది లక్షల మంది ప్రజలకు, లక్షలాది వన్యప్రాణులకు ఆధారమైన అడవులు.. కాలిపోతున్నాయి. దీని వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఈ ఘటన నా హృదయాన్ని ఎంతో బాధిస్తోంది.
సాయిధరమ్ తేజ్: అమెజాన్ అడవి కాలిపోవడం చూస్తుంటే ఊపిరాడటం లేదు. దీన్ని ఆపడానికి మనమేం చేయలేం.. కేవలం సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేయగలం. మంటలు ఆగుతాయని ఆశిస్తూ.. మరిన్ని చెట్లను నాటుదాం.
రకుల్‌ప్రీత్ సింగ్: ఈ ఘటన నన్నెంతో బాధించింది. మనం మన వ్యక్తిగత అవసరాల్ని పక్కనపెట్టి.. భూమికి ఏం కావాలో చూడాల్సిన సమయం ఇది. పర్యావరణం పచ్చగా ఉండేందుకు మనవంతు కృషి చేద్దాం.
అనుష్క శర్మ: ఈ వార్త ఎంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజంగా ఇది ఎంతో భయానకమైన వార్త. ఇకనైనా ప్రపంచ మీడియా ఈ ఘటనకు అధిక ప్రాముఖ్యత ఇస్తుందని ఆశిస్తున్నా.
హన్సిక: నా గుండె పగిలింది. భూగ్రహానికి ఊపిరితిత్తులతో సమానమైన అమెజాన్ అడవులు కాలిపోతున్నాయి. అడవుల్లో నివసించే ప్రజల్ని ఓదార్చలేని పరిస్థితి ఏర్పడింది. అమెజాన్ అడవుల కోసం ప్రార్థిద్దాం.