ఏ సినిమాకి రా కనకాంబరం, అంత కంగారడిపోతున్నావు??
కనకాంబరం : ఏ సినిమాకా?? మర్చిపోయావా, రెండు రాష్ట్రాల జనం వెర్రెక్కి వెయిట్ చేస్తున్నారు చిరంజీవి నూటాభై, బాలయ్య వందో సినిమా గురించి.
ఏకాంబరం : వాటికా!! ఇంకా రిలీజే అవ్వలేదు కదా. అయినా నన్ను కలపకు నేనేం వెయిట్ చేయట్లేదు.
కనకాంబరం : నీతో ఇదే వచ్చిందిరా ప్రతి దానినీ “తూ.. నా బొడ్డు” అని తీసిపడేస్తావ్.
ఏకాంబరం : లేకపోతే అన్నిటినీ నీలా నెత్తి మీద పెట్టేసుకోమంటావా?? అయినా ఆ క్రిష్ ఏంట్రా.. ఖబడ్దార్ అని అన్నాడు. అంటే చిరంజీవి సినిమానేగా.
కనకాంబరం : నువ్వు కూడా ఏంట్రా, మీడియా వాళ్ళంటే పాపం ఏదో బతకాలి కాబట్టి అలా రాసారు. అతను తెలుగు జాతిని మరిచిపోయిన వాళ్ళ కోసం అలా అన్నాడు.
ఏకాంబరం : ఒరే “పిర్ర గిల్లి జోల పాడడం” అనే సామెత ఎప్పుడైనా విన్నావా??
కనకాంబరం : నువ్వు ఎన్ని వెధవ వంకలన్నా పెట్టు. ఈ సారి రెండు బొమ్మలు హిట్ అవడం ఖాయం.
ఏకాంబరం : సంక్రాంతికి రిలీజ్ చేస్తే రెండేంటి, వంద బొమ్మలయినా హిట్ ఐపోతాయి. పోయినేడు చూడలేదా??
కనకాంబరం : నువు మారవురా.. జనం ఆనందంతో చూస్తారు, డబ్బులొస్తాయి. అయినా రెండూ రెండు రకాల సినిమాలురా.
ఏకాంబరం : అవును ఒకటి మూస మాస్ ఫార్ములా, ఇంకోటి లేటెస్ట్ ట్రెండు గ్రాఫిక్కు ఫార్ములా. అయినా కొత్తగా ఏం చేయరేంట్రా ఈళ్ళు.
కనకాంబరం : వాళ్ళ కష్టం చూడరా.. బాలయ్య ఈ వయసులో కూడా గుర్రం మీద యుధ్ధాలు, చిరంజీవి బరువు తగ్గి న్యులుక్కు అసలు అదిరిపోయాయంతే..
ఏకాంబరం : “ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా” అని పాత సామెత ఒకటుందిలే.
కనకాంబరం : అందులో తప్పేం ఉందిరా..
ఏకాంబరం : ఏరా ఇంకా ఎన్నాళ్ళు చిరంజీవి మాస్ సినిమాలు చేస్తాడ్రా?? బాలయ్య ఆ మీసం తిప్పడం అనే డైలాగులు మానడా??
కనకాంబరం : నాయనా చిరంజీవిది మాస్ సినిమా అయినా రైతు కష్టాల గురించి, బాలయ్యది ఒక గొప్ప యోధుడి గురించి రెండూ మెసేజి ఓరియంటెడ్ మూవీస్ తెలుసా??
ఏకాంబరం : అవునవును.. రైతులంట యోధులంట. ఊరుకో ఎహే..
కనకాంబరం : ఇప్పుడవన్నీ కాదు మొదటి రోజు మొదటి షో చూస్తున్నామా లేదా??
ఏకాంబరం : నువ్వు చూడు. నేను రివ్యూ చదివాకే చూస్తాను.
కనకాంబరం : ఓరి బాబూ రివ్యూలేంట్రా?? వాళ్ళు అన్నీ అలాగే రాస్తారు బాలేదని. పోనీ వాళ్ళనొచ్చి తియ్యమను సినిమా.. అపుడు తెలుస్తుంది.
ఏకాంబరం : ఒరే ఆమ్లెట్టు బాగా ఉందో లేదా చెప్పడానికి వండడం రావాల్సిన అవసరరం లేదురా బుజ్జే…
కనకాంబరం : రానప్పుడు నోరు మూసుకొని తినాలి. అంతే కానీ ఆయిల్ రెండు స్పూన్లు వేసావ్, టాటా వారి సాల్ట్ వాడి ఉండాల్సింది అని ఎదవ వంకలు పెట్టకూడదు.
ఏకాంబరం : రేటింగులు చూడాలిరా !!
కనకాంబరం : వాళ్ళు రేటింగు ఇస్తే మనం చూడాలా వద్దా అనుకోవడం ఏంటెహే.. మనకంటూ ఓ టేస్టుండాలి కదా. ముందు సినిమా చూడు. బాగోకపోతే అప్పుడు నచ్చలేదు అని చెప్పు.
ఏకాంబరం : అంతేనంటావా?? పద. ఎన్ని అనుకున్నా సినిమాలు చూడడం మానలేం కదా. వెళ్ళి ఓ రెండు టికెట్లు ఆపమని చెప్దాం.
— V.K