తమిళంలో వరుస హిట్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాడు విజయ్. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయ్ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ తనయుడు జసన్ సంజయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఓ షార్ట్ ఫిలింను డైరెక్షన్ చేసి అందులో హీరోగా నటించాడు. 6 నిమిషాలకు పైగా ఉన్న ఈ షార్ట్ ఫిలిం టైటిల్ జంక్షన్. దీన్ని రూపొందించిన తీరు చూస్తే విజయ్ కొడుకు హీరో అవుతాడని అభిమానులంతా అనుకున్నారు. తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడని ఊహించేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ తనయుడు జసన్ కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్నాడు. అందులో భాగంగా అతడు దర్శకత్వంపై మెలకువలు నేర్చుకోవడంతో పాటు హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ తో పని చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత జేవియర్ బ్రిట్టో మాట్లాడుతూ విజయ్ కుమారుడు జసన్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జసన్ ఎంట్రీ కోసం చాలామంది ఆసక్తిగా ఉన్నారు. కానీ జసన్ మాత్రం నటనపై ఆసక్తి చూపడం లేదు. జసన్కు ఎక్కువగా దర్శకత్వంపైనే ఆసక్తి ఉంటుందని నిర్మాత జేవియర్ బ్రిట్టో తెలిపాడు.