రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు!!’ అనేది ఉప శీర్షిక. శాంటో మోహన్ వీరంకి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాని నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది. హీరో రానా ఈ మూవీ టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ఇందులో స్టాండప్ కమెడియన్‌గా కనిపించి వినోదం పంచారు రాజ్ తరుణ్. స్టాండప్ కామెడీకి ఒరిజినాలిటీ అవసరమని తెలుసుకుని బాత్రూమ్లో ఆయన చేసిన ప్రయత్నం, మరికొన్ని సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇలా కామెడీ ట్రాక్ సాగుతూనే మధ్యలో సీనియర్ నటి ఇంద్రజ, మురళీ శర్మ సడెన్ ఎంట్రీ ఆసక్తిని పెంచింది.
‘‘మగాళ్ల గురించి ప్రియాంక చోప్రా అన్న మాటలకి ఈలలు వేశారు.. అదే చలపతిరావు అంటే గోల చేశారు. చివరగా నేను చెప్పేదేంటంటే ‘ఒక అబ్బాయి సింగిల్‌గా ఉంటే పులి అవుతాడు. అదే అమ్మాయితో ఉంటే పులిహోర అవుతాడు’’ అని రాజ్ తరుణ్ ఇచ్చిన స్పీచ్ మెప్పిస్తుంది. వెన్నెల కిశోర్ తనదైన మార్క్‌ని చూపించారు.