దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరోసారి గ్రామీణ నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అటువంటి కథలకే ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రేమకథకు పొలిటికల్ టచ్ ఇస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్నాడు.
పెదకాపు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గోదావరి జిల్లాల నేపథ్యంలో కథ నడుస్తుంది. గ్రామస్థాయిలో రాజకీయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు.
పెదకాపు సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, రక్తపాతం కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలలోని కొత్త కోణం ఈ సినిమాతో కనిపిస్తుందని అంటున్నారు.
పెదకాపు చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా చనువుగా చూసిన అనే పాటను విడుదల చేశారు.
ఆగస్ట్ 18న విడుదలకాబోతున్న ఈ మూవీతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా ఈ చిత్రంలో రావు రమేశ్, నాగబాబు, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, అనసూయ, ఈశ్వరీ రావు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.