టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. అమలాపురం బ్యాక్ డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమాని ‘పలాస 1978’ డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎలక్ట్రీషియన్ సుధీర్ బాబు ‘సూరిబాబు’ గా తనకు ఇష్టమైన అమ్మలాంటి అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ వీరి ప్రేమ ఎన్నో మలుపులు తిరుగుతూ చివరాఖరకు ఏ తీరానికి చేరుకుందనేది మిగతా కథ. ఆగస్టు27న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ: సూరిబాబు (హీరో సుధీర్ బాబు) అమలాపురంలో ఎలక్ట్రీషియన్. ఓ గుడిలో లైట్ సెట్టింగ్ వేస్తున్న సమయంలో అక్కడ సోడాలు అమ్ముకునే శ్రీదేవి(ఆనంది)ని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఆ ఊళ్లో పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు కాశీ.. శ్రీదేవిని ఇష్టపడతాడు. దానికితోడు సూరిబాబును తక్కువ కులం అని వారి ప్రేమను భగ్నం చేయాలనుకుంటాడు.
మరోపక్క మూడు ముళ్లు వేసేందుకు మనసులు కలిస్తే సరిపోదని, కులం కూడా కలవాలంటూ ఈ ప్రేమజంట పెళ్లికి విముఖత చూపిస్తారు పెద్దలు. ఇంతలో ఆ గ్రామంలో హత్య జరుగుతుంది. దానికి సూరిబాబే కారణమని అతడిని జైల్లో వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? సూరిబాబు జైలు నుంచి విడుదలయ్యాడా? అతడు జైలు నుంచి తిరిగొచ్చేలోపు శ్రీదేవి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉందా? లేదా కులం కట్టుబాట్లను దాటుకుని సూరిబాబుతో ఏడడుగులు నడిచిందా? అదీ కాకుండా పెద్దల మనసు మార్చి వారి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నారా? అసలు సూరిబాబుకు ఆ హత్యకు సంబంధం ఏంటి? విలన్ కాశీ, హీరోయిన్ తండ్రి చావుకు కారణాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్లలో బొమ్మ చూడాల్సిందే.
నటీనటులు: సుధీర్ బాబు సినిమా కోసం ప్రాణం పెట్టినట్లు కనిపిస్తుంది. సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు జీవించేశాడు. లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో ఇరగదీశాడు. హీరోయిన్ ఆనంది కూడా సుధీర్‌తో పోటీపడి మరీ నటించింది. నరేశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ: సుధీర్ బాబు సిక్స్‌ప్యాక్ కోసం పడ్డ కష్టం ఏమాత్రం వృథా కాలేదు. తన నటనతో అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ఇక కథ స్టార్ట్ అవడమే జైలు సన్నివేశంతో మొదలవుతుంది. తర్వాత వచ్చే బోట్ సీన్లు, ఫైటింగ్, బీజీఎమ్ ఓ స్థాయిలో ఉంటాయి. పల్లెటూరి అందాలను తెరపై మనోహరంగా చూపించారు. కామెడీ, ప్రేమ కథతో ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోతుంది. లవ్ స్టోరీ కొంత రొటీన్‌గా అనిపించక మానదు. పైగా కథలో పలు సన్నివేశాలను ప్రేక్షకుడు ముందే ఊహించేలా ఉండటం నెగెటివ్ అని చెప్పొచ్చు.
సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులు ఎదురవుతుంటాయి. శ్రీదేవిని విలన్‌కిచ్చి పెళ్లి చేస్తాడు ఆమె తండ్రి. అయినప్పటికీ శ్రీదేవి అతడితో జీవించేందుకు అంగీకరించదు. హీరో రాక కోసం నిరీక్షిస్తుంది. అతడితో వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. ఈ క్రమంలో కథను ఊహించని మలుపు తిప్పుతాడు దర్శకుడు. ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకులను కంటతడి పెట్టించే ప్రయత్నం చేశాడు. కానీ నత్తనడకన సాగే కథతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. ఇక కథ చివర్లో వచ్చే క్లైమాక్స్ సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది.
టైటిల్ : శ్రీదేవి సోడా సెంటర్
నటీనటులు : సుధీర్ బాబు, ఆనంది, నరేశ్, పావల్ నవగీతమ్, తదితరులు
నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
దర్శకత్వం: కరుణ కుమార్
సంగీతం : మణిశర్మ
హైలైట్స్: నటీ, నటులు
డ్రాబ్యాక్స్: రొటీన్ కథ
చివరిగా: ‘పాత’ కథకి ‘కొత్త’ ముగింపు
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)