సంచలన నటి శ్రీరెడ్డి తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని.. కొత్తగా వచ్చే నటీమణులు పక్కలో పడుకుంటే కానీ కొంత మంది ఛాన్స్ ఇవ్వడం లేదని..ఇలా ఎంతో మంది అమ్మాయిలు తమ జీవితాలు బలి చేసుకున్నారని ఆరోపిస్తోంది. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. ఆమెకు మహిళా సంఘలు, విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం పలికాయి. అయితే ఉద్యమం పీక్ స్టేజ్ లోకి వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్, అతని తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అనూహ్యంగా ఆమె ఉద్యమంపై దెబ్బ పడింది.
అంతే కాకుండా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సాక్షిగా బీభత్సం సృష్టించారు. దాంతో కొంత కాలంగా ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో షూటింగ్ లో ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన ప్రసంగంలో ‘ఎవరు ఎవరి దగ్గరో పడుకుంటే దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలట’ అంటూ వేసిన వ్యంగ్యాస్త్రం మీద శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు.
పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసి ప్రభావితమయ్యేవారు ఎంతో మంది ఉంటారని, ఒక పబ్లిక్ స్టేజీ మీద ఆయన అభ్యంతరకరంగా మాట్లాడటం సరైనది కాదు అని ఈ సందర్భంగా శ్రీరెడ్డి తప్పుబట్టింది. ఒక రాజకీయనాయకుడు అయి వుండి..ఒక ఆడపిల్ల సహాయం అడిగితే.. ఎవరు ఎవరితోనో పడుకుంటే నేనెందుకు బాధ్యుడిని అవుతాను అనడం, ఆ విషయం చెబుతూ వెటకారం నవ్వులు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం లేదంటూ శ్రీరెడ్డి మండి పడ్డారు. గతంలో పవన్ ఫ్యాన్స్ వర్సెస్ శ్రీరెడ్డికి ఎంత వివాదం నడిచిందో అందరికీ తెలిసిందే..ఇప్పుడు మళ్లీ శ్రీరెడ్డి కామెంట్స్ చేయడం మొదలు పెట్టింది..మరి ఈసారి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.