టాలీవుడ్‌లో ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరో కిరణ్ అబ్బవరం. ఫస్ట్ సినిమాతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ అనే డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీధర్ గాదె డైరెక్షణ్ వహించిన ఈ సినిమాలో సాయికుమార్ కీలకపాత్రలో నటించారు. మరి హీరో కిరణ్ అబ్బవరం తన రెండో సినిమాతో ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకున్నాడో రివ్యూలో చూద్దాం..
కథ: కడప జిల్లాకు చెందిన ధర్మ(సాయి కుమార్) తండ్రి వారసత్వంగా వచ్చిన శ్రీరాజ్య లక్ష్మీ కల్యాణ మండపాన్ని (ఎస్.ఆర్.కల్యాణమండపం) నిర్వహించడంలో విఫలమై .. తాగుడుకు బానిస అవుతాడు. అతని కొడుకు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) సిటీలో ఇంజనీరింగ్ చదువుతుంటాడు. అదే కాలేజీలో చదువుతున్న తన గ్రామానికి పాపారావు (శ్రీకాంత్ అయ్యంగర్) గారి అమ్మాయి సింధు (ప్రయాంక జవాల్కర్) తో లవ్‌లో పడతాడు. తండ్రితో మాట్లాడడానికే ఇష్టపడని కళ్యాణ్.. సింధు ప్రేమను పొందేందుకు చాలా పాట్లు పడుతుంటాడు. ఒక రోజు ఇంటి నుంచి ఫోన్ రావడంతో కళ్యాణ్ తన స్వగ్రామానికి వెళ్తాడు. కొన్ని కారణాల వల్ల పేరు మాసిపోయి, గిరాకీ తగ్గిన ఎస్. ఆర్. కల్యాణమండపం నిర్వహణ బాధ్యతలను భుజానకెత్తుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కళ్యాణ్.. కల్యాణ మండపాన్ని నడిపేందుకు ఎందుకు సిద్ధమైతాడు? ఎంతో చరిత్ర ఉన్న ఎస్.ఆర్. కల్యాణమండపానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రితో కళ్యాణ్ మాట్లాడకపోవడానికి కారణమేంటి? తనంటే నచ్చని సింధు ప్రేమని కళ్యాణ్ ఎలా పొందాడు? అనేదే కథలో అంశం.
నటీనటులు: ఇంజనీరింగ్ స్టూడెంట్ కళ్యాణ్ పాత్రలో హీరో జీవించాడు. డాన్స్‌తో పాటు ఫైట్స్ కూడా బాగానే చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కూడా కిరణ్ అద్భుతంగా నటించాడు. సింధు పాత్రలో ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక హీరో తండ్రిగా సాయికుమార్ అద్భుతంగా నటించాడు. తాగుబోతు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. మరీ ముఖ్యంగా భార్యతో పడే గొడవలు, అలకలు అత్యంత సహజంగా కనిపిస్తాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాపరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగర్‌తో పాటు ఇతర నటీ, నటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
విశ్లేషణ: సినిమా కథ మొత్తం టైటిల్ ‘ఎస్. ఆర్. కల్యాణ మండపం’ చుట్టేనే తిరుగుతుంది. తండ్రి వారసత్వంగా వచ్చిన కల్యాణ మండపాన్ని సక్రమంగా నిర్వహించని అసమర్థ కొడకు, ఆయన చేతకాని తనాన్ని గుర్తించి, తాత ఆశయాన్ని భూజనకెత్తుకున్న మనవడి కథ ఇది. దీనికి ప్రేమను జోడించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీధర్ గాదె. కథలో కూడా కొత్తదనం ఏమీ ఉండదు. సెంటిమెంట్ సీన్స్ వర్కౌట్ అయితే సినిమా స్థాయి వేరేలా ఉండేది. సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉండడం కాస్త ప్రతికూల అంశమే. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ బోరింగ్‌గా ఉన్నప్పటికీ.. క్లైమాక్స్‌లో తండ్రి, కొడుకు మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ కొంతమేర వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చైతన్ భరద్వాజ్ సంగీతం. విశ్వాస్ డానియెల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రం నేటివిటీకి తగ్గట్టుగా చాలా సహజంగా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
టైటిల్: ఎస్‌ఆర్ కళ్యాణ మండపం
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తదితరులు
దర్శకత్వం: శ్రీధర్ గాదె
నిర్మాతలు : ప్రమోద్, రాజు
సంగీతం: చైతన్ భరద్వాజ్
హైలైట్స్: కిరణ్ అబ్బవరం, సాయికుమార్, ప్రియాంక జవాల్కర్ నటన
డ్రాబ్యాక్స్: కథలో కొత్తదనం లేకపోవడం
చివరిగా: పెద్దగా ఆకట్టుకోలేని ‘కళ్యాణ మండపం’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)