ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ శుక్రవారం ప్రకటించింది. ఇదే విషయాన్ని ఎస్పీ బాలు తనయుడు చరణ్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని నిన్న (ఆగస్టు 20న) భావోద్వేగానికి గురైన చరణ్.. ఈరోజు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని గుడ్ న్యూస్ చెబుతూ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు
“నిన్నటి వరకు విషమంగా ఉన్న మా నాన్న ఆరోగ్యం నేడు నిలకడగా ఉంది. ఆయన కదులుతున్నారు, చేతులు ఆడిస్తూ థమ్సప్ సింబల్ చూపిస్తున్నారు. వైద్యులను గుర్తిస్తున్నారు. ఇప్పుడు కాస్త శ్వాస సులువుగా తీసుకోగలుగుతున్నారు. అందరినీ గుర్తిస్తున్నారు. ఇప్పటికైతే మాట్లాడలేకపోతున్నాడు కానీ త్వరలోనే అది కూడా జరిగి తీరుతుంది. వైద్య సిబ్బందిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. నాన్న కోలుకోవాలని ఎంతో మంది ప్రార్థిస్తున్నారు. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. మా నాన్న మీద, మా కుటుంబం మీద ప్రేమాభిమానాలు చూపించడమే కాకుండా, మా నాన్న కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని చరణ్ తెలిపారు.