గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) మనకిక లేరు. కరోనా సోకడంతో గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం గతంలో ఓసారి విషమించడంతో ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగిస్తూ వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది.
కొన్ని రోజుల కిందట కరోనా నెగెటివ్ రావడంతో ఎస్పీబీ కోలుకున్నారని, పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని అభిమానులంతా భావించారు. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై సమాచారం అందిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎస్పీబీ కన్నుమూశారు. బాలు మృతి పట్ల యావత్ సినీ, సంగీత ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు.