ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత క్షీణించినట్లు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. గురువారం సాయంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కరోనాతో బాధపడుతూ ఆగస్ట్ 5న ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్యులు ఇవాళ అర్ధరాత్రి తర్వాత మరో బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇటీవల పరీక్షల్లో ఎస్పీ బాలుకు కరోనా నెగెటివ్ రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తొందరలోనే కోలుకుని డిశ్చార్జి అవుతారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ద్రవ పదార్థాలు ఆహారంగా తీసుకుంటున్నారని, సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన తనయుడు చరణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే నటుడు కమల్‌హాసన్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని బాలు ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ రాత్రికి కమల్‌హాసన్ ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆస్పత్రికి చేరుకుంటున్నారు.