కరోనా సమయంలో.. సినీ నటుడు సోనూ సూద్ ప్రజలకు సహాయం చేస్తూ.. రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. వేలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేర్చిన సోనూ సూద్‌ని దేవుడిగా కీర్తిస్తున్నారు. అయితే ఆయన సేవా కార్యక్రమాల వెనుక ఉద్దేశం ఇటీవలి కాలంలో చర్చనీయాంశమౌతోంది. ఏదో ప్రయోజనం ఆశించకుండా ఆయన ఇదంతా ఎందుకు చేస్తాడని అన్నవారూ ఉన్నారు. సోనూ రాజకీయాల్లోకి వచ్చేందుకే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విమర్శలకు సోనూ ఇటీవల ఓ ముఖాముఖిలో కథ రూపంలో జవాబిచ్చారు.
”నేను చిన్నప్పుడు ఓ కథ విన్నాను. ఓ సాధువు వద్ద ఒక ఉత్తమ జాతి గుర్రం ఉండేది. దానిని తనకు ఇవ్వమని ఓ దొంగ అడగ్గా.. సాధువు తిరస్కరిస్తాడు. కొంతదూరం ప్రయాణించాక, నడవలేక నడుస్తున్న ఓ ముదుసలి సాధువుకు కనిపిస్తాడు. సాధువు జాలితో ఆ ముసలి వ్యక్తికి తన గుర్రాన్ని ఇచ్చేస్తాడు. అయితే గుర్రం మీద కూర్చున్న వెంటనే అ వ్యక్తి భయంకరంగా నవ్వి.. తానే ఆ దొంగ అనే సంగతి బయటపెడతాడు. అప్పుడు సాధువు అతన్ని అపి.. అతను గుర్రాన్ని తీసుకోవచ్చని కానీ ఈ విధంగా తీసుకున్నట్టు ఎవరికీ చెప్పవద్దంటాడు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే వారు అవసరంలో ఉన్నవారికి కూడా సహాయం చేయటం మానేస్తారని దొంగను కోరుతాడు. ఇప్పుడు నేనూ అదే చెప్తున్నాను. ఇది (విమర్శలు) మీ వృత్తి.. దీని వల్ల మీకు వేతనం లభిస్తుంది కాబట్టి మీరు చేయవచ్చు. కానీ మీ మాటలు, చేతల ప్రభావం నాపై పడదు. నేను నా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటాను” అని సోనూ అన్నారు.
ఏడు లక్షల మంది వివరాలున్నాయి..
అంతేకాకుండా ”నేను సహాయం చేసిన 7,03,246 వ్యక్తుల చిరునామా, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డు సంఖ్యతో సహా అన్ని వివరాలు నా వద్ద ఉన్నాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చేందుకు నేను సహాయపడిన విద్యార్థుల వివరాలు కూడా ఉన్నాయి. నేను విమర్శించిన వారందరికీ జవాబివ్వాలనుకోవటం లేదు. కానీ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. నన్ను విమర్శించే బదులు, కాస్త బయటకి వెళ్లి ఎవరికైనా సహాయం చేయండి” అని ఆయన కోరారు.