ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుంటాడు రియల్ హీరో సోనూసూద్. కరోనా విపత్కాల సమయంలో ఎంతోమందిని ఆదుకుని నిజమైన ఆపద్భాందవుడు అనిపించుకున్నారు. ఇప్పుడు పేదలంతా సోనూసూద్‌ను దేవుడంటున్నారు. కొంతమంది తమ పిల్లలకు సోనూసూద్ పేరు కూడా పెట్టుకుంటున్నారంటే వాళ్ల మనసుల్లో అంతగా స్థానం సంపాందించిన సోనూసూద్‌ను అభినందించని వారు లేరు. దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. చాలామంది కరోనా రోగులకు ఆక్సిజన్ అందక వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
కేంద్రప్రభుత్వం ఆక్సిజన్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. విదేశాల నుంచి సైతం ఆక్సిజన్ ట్యాంకర్లను, ఆయా పరికరాలను రప్పిస్తోంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పే ప్రయత్నం చేస్తోంది. సోనూసూద్ కూడా తాజాగా ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేసేందుకు ముందుకొస్తున్నారు. కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుకు సోనూసూద్ నిర్ణయం తీసుకున్నారట. దీనికోసం ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రప్పిస్తున్నట్లు సోనూసూద్ వెల్లడించారు. ఇతర దేశాల అధికారులతో మాట్లాడి ఆక్సిజన్ ప్లాంట్ల కొనుగోలుకు చర్చలు జరుపుతున్నారట.