కరోనా మహమ్మారి సంక్షోభంలో ఎక్కువగా నష్టపోయింది వలస కూలీలు. పొట్టకూటి కోసం సొంతూరు, కుటుంబాన్ని వదిలి వెళ్లిన వారి పరిస్థితి మరింత అగమ్య గోచరంగా తయారైంది. లాక్‌డౌన్ కారణంగా పట్టణాల్లో చిక్కకుపోయారు. పనుల్లేక, తినడానికి తిండిలేక నానా అవస్థలు పడ్డారు. సొంతూళ్లకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన వారు కొందరైతే దొరికిన వాహనాన్ని పట్టుకుని వెళ్లిన వారు మరికొందరు. ట్యాంకర్లలో, అంబులెన్స్‌లలో దాక్కుని ఎలాగైనా సొంతూరు చేరుకోవాలనే తపనతో ప్రయాణించిన వారు ఇంకొందరు. కొందరైతే ఈ ప్రయాణాల్లో ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఎన్నో విషాధ ఘటనలు జరిగాయి. చెట్టుకు ఒకరు పుట్టకు ఒకరు అన్నట్టుగా కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది ఈ కరోనా మహమ్మారి.
కరోనా సంక్షోభంలో వలస కూలీల వెతలు చూసి చలించిపోయిన పలువురు వారికి సహాయం చేశారు. వీరిలో ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ఒకరు. ఈ విపత్తు కాలంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్రత్యేకమైన బస్సులు, రైళ్లు ఏర్పాట్లు చేసి వారిని స్వస్థలాలకు చేర్చాడు. దీంతో పాటు పంజాబ్‌లోని ఓ వైద్య బృందానికి పీపీఈ కిట్లను సైతం విరాళంగా అందించాడు. వారి అవస్థలను దగ్గరుండి చూసిన సోనూసూద్ వారి జీవితాలపై ఓ పుస్తకం రాస్తున్నాడు. దానికి లైఫ్ ఛేంజింగ్ అని పేరు పెట్టాడు. ‘గత మూడున్నర నెలలుగా వలస కార్మికులతో రోజుకు 16 నుంచి 18 గంటలు గడుపుతూ, వారి బాధలను అర్థం చేసుకున్నాను. వారి ముఖాలపై చిరు నవ్వు, ఆనందం నా జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాయి. ఈ ప్రయాణంలో వారితో ఏర్పడిన ఓ అందమైన బంధాన్ని పుస్తకంగా రాస్తున్నాను. చిట్టచివరి వలస కూలీ తన స్వగ్రామానికి చేరే వరకూ ఈ కార్యక్రమాన్ని ఆపనని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో వెల్లడించాడు సోనూసూద్. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురించనున్నట్లు సోనూసూద్ వెల్లడించారు.