బాలీవుడ్ నటుడు సోనూసూద్ పంజాబ్‌లోని మోగాలో 1973లో జులై 30న జన్మించాడు. సోనూ అమ్మ ప్రొఫెసర్. నాన్న బట్టల వ్యాపారి. వీళ్ల దుకాణం ఎదుట వారానికొకసారి అన్నదాన కార్యక్రమం చేపట్టేవారు. ఇందులో సోనూ పాల్గొనేవాడు. నలుగురికి సాయపడటంలో ఉండే ఆనందం అప్పుడే సోనూకి అనుభవమైంది. దీనికితోడు ‘జీవితంలో నువ్వు ఏ స్థాయికి ఎదిగినా, ఎంత డబ్బు సంపాదించినా.. అవసరంలో ఉన్నవారికి సాయపడినపుడే అసలైన విజయం అందుకున్నట్టు’ అని వాళ్లమ్మ చెప్పిన మాటలు సోనూకి స్ఫూర్తినిచ్చాయి. అలా పాఠశాల, కాలేజీ రోజుల్లో తనకి చేతనైన సాయం చేయడం ప్రారంభించాడు.
సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్.. కరోనా సమయంలో ఆపదలో ఆదుకుంటూ రియల్ హీరో అనిపించుకున్నాడు. అలా కొవిడ్ ఫస్ట్‌వేవ్ లాక్‌డౌన్‌లో తన స్నేహితులతో కలిసి చాలామంది ఆకలి తీర్చిన సోనూ, అదే సమయంలో సొంత ఊరికి నడిచిన వెళ్తున్న వారిని చూసి చలించిపోయారు. కొందరినైనా బస్సులో పంపాలనుకున్న సోనూ ఆలోచన లక్షల మందిని తమ ఇళ్లకు చేర్చే కార్యక్రమంగా మారింది. సోనూ సాయం వల్ల సుమారు ఎనిమిది లక్షల మంది బస్సులు, రైళ్లు, విమానాల్లో తమ సొంతూళ్లకి చేరుకున్నారు. వీరిలో విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులూ ఉన్నారు. చదువు, ఉపాధి, వైద్యం విషయంలో అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి తన ఉదారత చాటుకున్నారు. ‘అన్నా.. సాయం చేయండి’ అంటూ ట్వీట్ చేయడమే ఆలస్యం ‘నేనున్నా’ అని భరోసా ఇచ్చి ఎన్నో ప్రాణాల్ని కాపాడారు. అప్పటి వరకూ నటుడిగా కొందరికే తెలిసిన సోనూ ఆ తర్వాత రియల్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
టాలీవుడ్‌లో నాగార్జున నిర్మించి, నటించిన ‘సూపర్’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఈ తరువాత పలు పాత్రల్లో నటించాడు. అయితే అరుదంతి సినిమాలో పశుపతి పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1996లోనే తెలుగమ్మాయి సోనాలీని పెళ్ళాడారు. వారికి అయాన్, ఇషాంత్ అనే ఇద్దరు అబ్బాయిలు. ప్రస్తుతం ఆయన చిరంజీవి ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ చిత్రం ‘తమిళరసన్’లోనూ, హిందీ సినిమా ‘పృథ్వీరాజ్’లోనూ ఆయన నటిస్తున్నారు. సోనూ సూద్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎందరో ఆయన హీరోగా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. సోనూసూద్ కి ‘క్లాప్ బోర్డ్’ తరుపున హృదయాపుర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.