కరోనా సమయంలో అడిగిన వారికి సాయం చేసి రియల్ హీరోగా నిలిచాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఎన్నో సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తోన్న ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 2022లో నిర్వహించనున్న బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బి.ఎం.సి) ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సోనూసూద్ పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కాంగ్రెస్ ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు సెలబ్రిటీలని ఎంపిక చేసుకుందని, ఆ జాబితాలో సోనూతోపాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్, మోడల్, ఫిట్నెస్ పర్సనాలిటీ మిలింద్ సోమన్ నిలిచారని టాక్ వినిపించింది. త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. తాజాగా సోనూసూద్ ఈ విషయంపై స్పందించారు. ఈ వార్తలు అవాస్తమని తెలిపారు. ‘ఈ వార్తల్లో నిజం లేదు. సాధారణ వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను’ అంటూ స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు, ఆయన అభిమానులు సోనూసూద్‌ని రాజకీయాల్లోకి రావాలని కోరుతుండగా మరికొందరు వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
Not true,
I am happy as a common man 🇮🇳 https://t.co/w5665MqAwc— sonu sood (@SonuSood) August 24, 2021