బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈసినిమా భారీ అంచనాల ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో చూద్దాం..
కథ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయుడు (అజయ్ పుర్కార్) కూతురి పెళ్లి జరుగుతుండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితశ్వ) కొడుకు వచ్చి పెళ్లికూతురిని తీసుకెళ్లిపోతాడు. దీంతో తెలంగాణ సీఎం.. ఆయన కొడుకుని మట్టుబెట్టాలని ఏపీ సీఎం రగిలిపోతుంటాడు. సుపారీ కిల్లర్లు ఒక్కొక్కరిగా తెలంగాణ సీఎం మీద ఎటాక్ చేయడానికి సిద్ధమవుతారు. కానీ వాళ్లకు రుద్రకంటి భాస్కర్ (రామ్) అడ్డు పడి.. అందరినీ లేపేస్తాడు. చివరికి అతను ఏపీ సీఎం మనిషే అని తెలుస్తుంది. భాస్కర్ తెలంగాణ సీఎం ఇంట్లో అడుగుపెట్టి ఏపీ సీఎం కూతురినే కాక.. తెలంగాణ సీఎం కూతురిని కూడా తీసుకెళ్లిపోతాడు. అప్పుడే తన ఉద్దేశం వేరు అని.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ అతను టార్గెట్ చేశాడని తెలుస్తుంది. ఇంతకీ భాస్కర్ కథేంటి.. అతనెందుకిలా చేశాడు.. చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.
బోయపాటి శ్రీను అంటేనే మాస్. లాజిక్కులతో సంబంధం లేకుండా.. ఓవర్ ద టాప్ ఎలివేషన్లు.. ఊర మాస్ యాక్షన్ సీన్లకు ప్రిపేరై వెళ్లే వాళ్లకు ‘స్కంద’ ఓకే అనిపిస్తుంది. అలా కాకుండా కథలో కొత్తదనం కోసం చూసినా.. సన్నివేశాల్లో లాజిక్కుల మీద దృష్టిపెట్టినా.. ‘స్కంద’తో ఎక్కువ సమయం ట్రావెల్ చేయలేరు. ఇది సగటు బోయపాటి మార్కు మాస్ మూవీ. రామ్ ఎనర్జీని వాడుకుని అతను మాస్ ను ఎంటర్టైన్ చేయడానికి చేసిన ప్రయత్నం కాబట్టి ఆ విషయంలో బోయపాటి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. బోయపాటి మార్కు.. నందమూరి బాలకృష్ణకు సూట్ అయినట్లు వేరే వాళ్లకు సూట్ కాదు అని చాలా సినిమాల్లో రుజువైంది. ‘అఖండ’ కంటే ముందు ‘వినయ విధేయ రామ’లో రామ్ చరణ్ తో బోయపాటి చేయించిన అతి.. పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా తయారైంది. ‘స్కంద’లో అలా మరీ నేల విడిచి సాము చేయకుండా.. మాస్ ను మెప్పించడానికి ప్రయత్నించాడు బోయపాటి.
రెండూ ముప్పావు గంటల నిడివి ఉన్న సినిమాలో హీరో దాదాపు రెండు గంటలు కనిపిస్తే.. ఒక గంటసేపు ఫైట్లు మాత్రమే చేస్తుంటాడు. రామ్ ఇంట్రో సీన్ బాగా పేలింది. ప్రథమార్ధంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో బోయపాటి కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కవుట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ పర్వాలేదనిపిస్తుంది. ద్వితీయార్ధంలో వచ్చే యాక్షన్ సీన్లలో భారీతనం.. ఎలివేషన్ మాస్ ను మెప్పిస్తుంది. కథ గురించి పెద్దగా పట్టించుకోకుండా.. లాజిక్కుల గురించి ఆలోచించకుండా ఓవర్ ద టాప్ ఎలివేషన్లు.. యాక్షన్ ఘట్టాలను ఎంజాయ్ చేయాలంటే ‘స్కంద’ చూడొచ్చు.
‘స్కంద’లో రామ్ తన క్యారెక్టర్లో అతను ఒదిగిపోవడానికి బాగానే కష్టపడ్డాడు. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ ఈ క్యారెక్టర్ కు సెట్ అయ్యాయి. రామ్ ను ఇంత మాస్ పాత్రలో చూసి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది కానీ.. ఆ తర్వాత ఓకే అనిపిస్తుంది. రామ్ తన ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడు ఈ రేంజ్ మాస్ మూవీ చేయలేదు. రామ్ ఎనర్జీతో బోయపాటి మార్క్ ఉస్తాద్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. ఫైట్లు.. డ్యాన్సుల్లో రామ్ అదరగొట్టాడు. హీరోయిన్స్ పర్వలేదు. దగ్గుబాటి రాజా, శ్రీకాంత్ బాగానే చేశారు. విలన్లు అజయ్ పుర్కార్,శరత్ లోహితశ్వ చాలా మామూలుగా అనిపిస్తారు. గౌతమి అసలు సినిమాలో ఎందుకుందో అర్థం కాదు. ఆమెని సరిగా వాడుకోలేకపోయాడు బోయపాటి. రామ్, శ్రీలీల తమ డ్యాన్సులతో రెండు పాటలను నిలబెట్టారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అఖండ రేంజ్ లో లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక పెద్ద సినిమా స్థాయిలో రిచ్ గా తీశారు సినిమా.
టైటిల్ : స్కంద
నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, పృథ్వీ
తదితరులు
నిర్మాతలు: శ్రీనివాస్ చిట్టూరి
దర్శకత్వం:బోయపాటి శ్రీను
సంగీతం: తమన్
చివరిగా: రొటీన్ మాస్ మూవీ