టాలీవుడ్ నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమా ద్వారా కిందటేడాది విజయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత ‘జెమ్’ అనే సినిమాను అంగీకరించాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించాడు. జయ దుర్గాదేవి మల్టీమీడియా పతాకంపై విజయ్ రాజా, తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న చిత్రం ఈరోజు హైదరాబాద్లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైంది. హీరో నాగశౌర్య ఈ సినిమాకి క్లాప్ కొట్టి.. మూవీ యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా లాంటి ప్రదేశాల్లో సినిమా చిత్రీకరణ జరుగుతుందన్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విజయ్ రాజా మాట్లాడుతూ.. ‘‘మా చిత్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరో నాగశౌర్య అన్నకి ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు మా దర్శకుడు, నిర్మాతకి ధన్యవాదాలు. కథ చాలా బాగుంది’’ అని తెలిపారు.