తెలుగు సినీ నటుల సంఘం (మా) కోసం పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నటుడు, మాజీ ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో 268 ఓట్లతో నరేశ్ అధ్యక్షుడిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్ గెలుపొందారు. అయితే మార్చి 22న తమ ప్రమాణ స్వీకారం నిర్వహించాలని నిర్ణయిస్తే దాన్ని శివాజీ రాజా అడ్డుకుంటున్నారని రెండు రోజుల క్రితం నరేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. ‘నా పదవీకాలం మార్చి 31వ తేదీ వరకు ఉంది. అప్పటి వరకు ఎవరూ ‘మా’ కుర్చీలో కూర్చోవద్దు’ అని శివాజీ రాజా చెప్పారని ఆయన తెలిపారు.
దీనిపై స్పందిస్తూ శివాజీ రాజా మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇతరుల్ని బాధపెడుతూ వ్యాఖ్యలు చేయడం ఆపాలని, ‘మా’ పరువును రోడ్డు మీదకు లాగొద్దని అన్నారు. ‘ఈ ప్రెస్‌మీట్ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ అందరూ అడుగుతుంటే నాపై ఒత్తిడి పెరిగింది. అందుకే మీడియా ముందుకు వచ్చా. ‘మా’ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరైనా సరే హుందాగా ప్రవర్తించాలి. దాన్ని కాపాడుకుంటేనే మంచిది. ‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి. ఇంతకు ముందు ‘మా’లో రాజకీయాలు లేవు. కానీ గత నాలుగేళ్లుగా రాజకీయాలు మొదలయ్యాయి. ఇక్కడ ఎవరికీ జీతాలు ఉండవు. 26 మంది 800 మందికి సేవ చేయాడానికి వస్తారు. నేను ఈసీ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకూ చేశా. ‘మా’లో 22 ఏళ్లు ఉన్నా.. ఒక్క టీ కూడా తాగలేదు’.
‘కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని కాపాడేందుకు కమిటీ ఉపయోగపడాలి. ‘శివాజీరాజా నువ్వు విశ్రాంతి తీసుకో’ అన్నారు. అలాగే నేనూ తీసుకుంటా. ‘మా’ రూల్స్ ప్రకారం మార్చిలో ఎన్నికలు జరగాలి, ఏప్రిల్ 1న ప్రమాణ స్వీకారం చేయాలని ఉంది. దాన్ని మనం ఫాలో అవ్వాలి కదా. నేనూ అలాగే ప్రమాణ స్వీకారం చేశా. నేను వారి (నూతన కార్యవర్గానికి) పనికి అడ్డుపడలేదు. అసలు నేను ఆఫీసుకే వెళ్లడం లేదు. ఓడిపోయిన తర్వాత వెళ్లాల్సిన అవసరం నాకు లేదు’.
‘నువ్వు అందర్నీ కలుపుకుని వెళ్తావు శివాజీ. నువ్వు ‘మా’ లో ఉండాలి అని ప్రముఖులు’ అన్నారు. ఆ మాటలు నాకు చాలు. నెగ్గిన తర్వాత మన ప్రవర్తన హుందాగా ఉండాలి. వాళ్లకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ముందుంటా. నాజర్, విశాల్ మమ్మల్ని నడిగర్ సంఘం కోసం మలేషియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రమ్మని పిలిచారు.. వెళ్లాం. అప్పుడు మేం సాధారణ గదిలో ఉంటే, నరేశ్ ఖరీదైన గదిని బుక్ చేసుకుని ఉన్నారు. అప్పుడు ‘మా’ డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతున్నాయని గుర్తుకు రాలేదా?. నా అపార్ట్‌మెంట్‌లు వందల కోట్లు విలువ చేస్తాయి అని నరేశ్ ఎప్పుడూ అంటుంటారు. నాకు అంత ఆస్తి ఉంటే.. కొంత ‘మా’ కు విరాళంగా ఇచ్చేవాడ్ని. మరి ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదే?.. ‘మా’ సొమ్ము నేను ఖర్చు చేస్తున్నానని చెప్పడం తప్పు కదా. ఇకపై ఇలాంటి తప్పులు చేయకండి నరేశ్. ఇలా ఒకర్ని బాధపెట్టి ప్రశాంతంగా పనిచేసుకోగలరా?. అధ్యక్షుడిగా గెలిచారు. ‘మా’ అభివృద్ధి కోసం కష్టపడండి. పాజిటీవ్‌గా ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి. రూ.2.90 కోట్లు ఉన్న దాన్ని శివాజీ రూ.5 కోట్లు చేశాడు.. నేను రూ.10 కోట్లు చేయాలి అనే కసి తెచ్చుకోండి’ అని శివాజీ అన్నారు.
‘మీరు చాలా సేవ చేశారు?ఎందుకు ఓడిపోయారు?’ అని మీడియా శివాజీని ప్రశ్నించగా.. ‘మేం ఇంత వరకు దాని గురించి మాట్లాడుకోలేదు. నాకు ఓ డ్రీమ్ ఉండేది. నేను ఓడిపోవడానికి కారణం కూడా అదే. ఇప్పుడు అది కూడా చెదిరిపోయింది. వృద్ధాశ్రమం కట్టాలి అనుకున్నా. కడితే.. పేరంతా నాకే వచ్చేస్తుంది అనుకున్న కొందరు కుట్రపన్నారు. ఈ క్షణంలో నేను చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పాలి. ‘శివాజీ నువ్వు చాలా కష్టపడుతున్నావు. కేటీఆర్‌తో నేను మాట్లాడుతాను. భూమి ఇప్పిస్తాను. నీ పనిలో నువ్వు ఉండు’ అని 24 గంటల్లోపు చిరు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ భూమి వచ్చి ఉంటే నా డ్రీమ్ నిజం అయ్యేది’ అని అన్నారు. అనంతరం నాగబాబు ‘మా’ గురించి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా.. ‘నాగబాబు నాకు 30 ఏళ్ల స్నేహితుడు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. నాగబాబు గురించి ఇక్కడ మాట్లాడకూడదు’ అని శివాజీ పేర్కొన్నారు.
‘మా’ కోసం పని చేద్దాం. ఇదే సందర్భంగా నేను మరో విషయం చెప్పాలి.. ప్రతి సంవత్సరం డైరీ రూపొందిస్తాం.. దానికి ఓ కమిటీ ఉంది. ఈసారి డైరీ నేను చేస్తానని నరేశ్ అన్నారు. సరే అని ఒప్పుకున్నాం. డైరీల ద్వారా రూ.14.20 లక్షల ఆదాయం వచ్చిందని నరేశ్ మీడియా ముందు చెప్పారు. కానీ అకౌంట్‌లో రూ.7 లక్షలే పడింది. మిగిలిన రూ.7 లక్షలు ఏమయ్యాయి? అడగాల్సిన బాధ్యత నాది. రేపు నేను లెక్కలు వారికి అప్పజెప్పాలి కదా. ఆ సొమ్ము ఏమైందనే విషయం చెప్పి నరేశ్ ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది. మేనిఫెస్టోలో ఏం చెప్పారో అవన్నీ చేయండి. మాటలు సరిగ్గా ఉండాలి. ఎదుటి వ్యక్తిని బాధపెట్టడం కాదు. నాకు ‘మా’ అంటే చాలా ఇష్టం. 22 ఏళ్లు దానితో అనుబంధం ఉంది. ఏ పని ఉన్నా సరే నేను వచ్చి చేస్తా’ అని శివాజీ తెలిపారు.