సినీ పరిశ్రమ ఇప్పుడు అందరి నోట్లో నానడానికి కారణం నరేశ్‌నని నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మరోసారి ఆరోపించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై తాజాగా ఆయన స్పందించారు. సభ్యులకు సేవ చేయాలనే ఆలోచనతోనే అందరూ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతుంటారని ఆయన అన్నారు. అనంతరం.. రెండు ప్యానల్స్ మేనిఫెస్టోలో చర్చించిన అంశాలను తాను ఎప్పుడో ప్రారంభించానని తెలిపారు.
‘‘మా’ ఎన్నికలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అసోసియేషన్‌లో ఇన్ని వివాదాలు జరగడానికి కారణం నరేశ్. నాకు తెలిసినంత వరకూ అసోసియేషన్‌లో మెంబర్‌షిప్ కార్డు పొందిన వాళ్లు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈసారి ప్రకాశ్‌రాజ్-మంచు విష్ణు ప్యానల్స్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. అధ్యక్ష పీఠం అధిరోహించి.. సభ్యులకు సేవ చేయాలని ఇద్దరూ ఆశిస్తున్నారు. అయితే, ‘మా’ అధ్యక్షుడి పదవీ కాలం రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేరు. నాకున్న అనుభవంతో ఈ విషయాన్ని చెబుతా.
కృష్ణ, కృష్ణంరాజు, మురళీ మోహన్, చిరంజీవి, మోహన్‌బాబు ఈ ఐదుగురు సినీ పెద్దలను కూర్చొపెట్టి.. ఈ విషయంపై చర్చించి.. మొదటి రెండేళ్లు విష్ణు అధ్యక్షుడిగా.. ప్రకాశ్‌రాజ్ జనరల్ సెక్రటరీగా.. ఆతర్వాత రెండేళ్లు విష్ణు జనరల్ సెక్రటరీగా.. ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడిగా పని చేసేలా చర్చలు జరిపితే ఎలాంటి గొడవలు ఉండవని అనుకుంటున్నాను’ అని శివాజీ రాజా వివరించారు. అనంతరం ఇప్పుడు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్రకటించిన మేనీఫెస్టోల్లోని సంక్షేమ పథకాలను తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తనస్థాయి మేరకు చేశానని వెల్లడించారు