టాలీవుడ్ సింగర్ సునీత ప్రముఖ డిజిటల్ మీడియా రామ్ వీరపనేనిని పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల 9వ తేదీన తన వివాహం జరగనుందని సునీత స్వయంగా ప్రకటించింది. ఈ రోజు ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కొత్త జీవితం బాగుండాలని స్వామి వారిని ప్రార్థించానని తెలిపింది. కరోనా విజృంభణ నేపథ్యంలో గత తొమ్మిది నెలలుగా తాను శ్రీవారిని దర్శించుకోలేకపోయానని చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొంది.
కాగా, వారి వివాహం కొద్ది మంది బంధుమిత్రుల మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. 19 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న సునీత అనంతరం భర్త నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి తన పిల్లలతో ఆమె వేరుగా ఉంటున్నారు.