HomeTelugu Big Storiesఎనిమిదేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యాను: చిన్మయి

ఎనిమిదేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యాను: చిన్మయి

8సంవత్సరాల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానని ప్రముఖ గాయని ‘చిన్మయి శ్రీపాద’ తెలిపారు. తనుశ్రీ వివాదం మొదలైన తర్వాత ఆమెకు మద్దతుగా ఇప్పటికే పలువురు నటీమణులు, ఆర్టిస్టులు సినిమా సెట్‌లో ఎదురైన వేధింపులను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో చిన్మయి కూడా ‘మీ టూ’ ఉద్యమంలో చేరారు. ట్విటర్‌ వేదికగా తనకు చిన్నతనం నుంచి ఎదురైన పలు చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సంఘటల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చాలా కష్టంగా, బాధగా ఉంటుందని అన్నారు.

3 6

‘అప్పుడు నాకు 8 ఏళ్లు ఉంటాయి. మా అమ్మ తన డాక్యుమెంటరీ కోసం రికార్డింగ్‌ సెషన్‌ పనిలో ఉన్నారు, నేను నిద్రపోతున్నా. నన్ను ఎవరో పట్టుకుని తడుముతున్న భావన కలిగి నిద్రలేచా. ‘ఈ అంకుల్‌ చెడ్డవాడు’ అని మా అమ్మకు చెప్పా. ఇదంతా సాంతోమ్‌ కమ్యూనికేషన్స్‌ స్టూడియోలో జరిగింది. అది ఇప్పటికీ ఉంది’ అని చిన్మయి పేర్కొన్నారు.

అనంతరం పదేళ్ల వయసులో జరిగిన మరో సంఘటన గురించి చెప్పారు. మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు అక్కడ వరసకు మామ అయ్యే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని చిన్మయి అన్నారు. చాలా మంది చిన్నారులు పెద్దల మధ్య సురక్షితంగా లేరని అభిప్రాయపడ్డారు. తన 19 ఏళ్ల వయసులో ఓ వృద్ధుడు ప్రేమగా కౌగిలించుకున్నట్లు నటించి, తప్పుగా ప్రవర్తించాడని.. ఆయనకు చెప్పు చూపించి ‘బై‌ సర్‌’ అని చెప్పి కోపంగా వచ్చేశానని తెలిపారు. ఓ మహిళ తనకు జరిగిన వేధింపుల గురించి పేర్లతో సహా చెబితే ఆపై అవకాశాలు రావని అన్నారు.

‘మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో బెదిరిస్తున్న వారిపై కేసు పెట్టా. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా కేసు పెట్టినందుకు నాకు సోషల్‌మీడియాలో మరిన్ని విద్వేషపూరితమైన సందేశాలు వచ్చాయి. యూట్యూబ్‌లో విజయవంతంగా రాణిస్తున్న విశ్లేషకుడు ప్రశాంత్‌ వృత్తిపరంగా నాకు మద్దతుగా ఉంటానని అన్నారు. ‘బాధపడకు స్వీట్‌హార్ట్‌, డార్లింగ్‌ నేను నీకు మద్దతుగా ఉంటా..’ అని సందేశాలు పెట్టారు. నాకు కోపం వచ్చి.. అలా పిలవకండి అన్నాను. దీంతో ఆయన నాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఓ వ్యక్తి పలకరించే తీరు, తాకే విధానాన్ని బట్టి అతడి మనసులోని ఉద్దేశం మహిళలకు అర్థం అవుతుంది’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్మయి వరుస ట్వీట్లు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu