తమిళ హీరో విజయ్ సేతుపతి, అంజలి జంటగా ‘సింధూబాద్’ సినిమా తెరకెక్కుతోంది. కె ప్రొడక్షన్స్ పతాకంపై రాజరాజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమా వివాదం కారణంగా ఆగిపోయింది. ‘బాహుబలి’ సినిమాను రాజరాజన్ తమిళంలో విడుదల చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి తీసిన ఈ సినిమా తమిళనాడులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటి వరకూ తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని రాజరాజన్ చెల్లించలేదని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కోర్టును ఆశ్రయించారు. రాజరాజన్ నిర్మించిన సింధూబాద్ ‘ఎన్నై నోకి పాయుమ్ తోటా’ సినిమాల విడుదలపై కేసు వేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు రెండు సినిమాల విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. కానీ రాజరాజన్ తన సహ నిర్మాతలు, భాగస్వాములతో కలిసి సింధూబాన్ సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే థియేటర్ యజమానులు దీనికి అంగీకరించలేదు. సినిమా విడుదలపై ఎటువంటి అభ్యంతరం లేదని డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ (డీసీపీ) నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తేనే స్క్రీనింగ్ వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమాపై కోర్టు స్టే విధించిన కారణంగా సర్టిఫికెట్ ఇవ్వమని డీసీపీ స్పష్టం చేసింది. ఇప్పుడు కె ప్రొడక్షన్ భాగస్వామ్య సంస్థ వైఎస్‌ఆర్ ఫిల్మ్స్ హైదరాబాద్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా విడుదలపై స్టే ఎత్తివేయాలని కోరింది.