‘ధూమపానం, మద్యం తాగడం వల్ల నేను చెడ్డ తల్లిని ఎలా అవుతాను?’ అని నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ నటి శ్వేతా సాల్వే. ఇటీవల శ్వేత తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవాకు వెళ్లారు. బికినీలో ధూమపానం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను శ్వేత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఆమె ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు మంచి తల్లి కానేకాదు. మీ పిల్లలకు కూడా ఈ అలవాట్లు వస్తాయి?’ అని కామెంట్లు చేశారు.
ఈ కామెంట్లపై శ్వేత స్పందించారు. ‘అవును నేను తాగుతాను, ధూమపానం చేస్తాను. నేను నిజాయతీగా ఉంటాను. కేవలం మద్యం, సిగరెట్ తాగడం వల్ల చెడ్డ తల్లిని ఎలా అవుతాను? నా జీవితాన్ని వృథా చేసుకోవడం మీరు చూశారా? పనిచేయకుండా ఖాళీగా గడపడం చూశారా? నా పిల్లల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూశారా? నిత్యం ఎన్నో పనులతో బిజీగా ఉంటాను. నేను నటిని, డ్యాన్సర్‌ను,పారిశ్రామికవేత్తని కూడా. ఇతరులను నేను ఈ విధంగా ప్రశ్నించను. కాబట్టి నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరూ ఇలాంటి ప్రశ్నలు వేయకండి. నా తల్లిదండ్రులు నన్ను పద్ధతిగానే పెంచారు. సమాజంలోని మంచి, చెడు తెలియజేశారు. వాళ్లు కూడా మద్యం, ధూమపానం చేసినవారే. ఇప్పటికీ ఏదన్నా వేడుక జరుపుకోవాలంటే నా తల్లిదండ్రులతో కలిసి మద్యం తాగుతాను. మీరు నా పోస్ట్‌లకు చేసే లైక్‌లను, ఫాలోవర్లను పట్టించుకోను. మీరే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరిస్తున్నారు. నా పద్ధతి నచ్చకపోతే అన్‌ఫాలో అవ్వచ్చు’ అని వెల్లడిస్తూ మద్యం తాగుతున్న ఫొటోను షేర్ చేశారు.
‘లిప్‌స్టిక్’, ‘కిట్టీ పార్టీ’, ‘లెఫ్ట్ రైట్ లెఫ్ట్’ వంటి హిందీ ధారావాహికల్లో శ్వేత నటించారు. ‘ప్యార్ మే కభీ కభీ’, ‘దిల్ తో బచ్చా హై’ తదితర చిత్రాల్లోనూ నటించారు.