టాలీవుడ్‌లో.. ‘కొత్తబంగారు లోకం’ సినిమాతో కుర్రకారును మైమరింపచేసి వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి శ్వేతాబసు ప్రసాద్. ఆ తర్వాత ఆమె దక్షిణాది చిత్రాలతోపాటు పలు బాలీవుడ్‌లో కూడా నటించారు. కొన్ని సంవత్సరాల ప్రేమ అనంతరం 2018లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ని ఆమె వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రోహిత్ నుంచి తాను విడిపోతున్నట్లు శ్వేతా గతేడాది ఇన్‌స్టా వేదికగా తెలిపారు. తాజాగా కోర్టు నుంచి విడాకులు తీసుకునేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శ్వేతాబసు ప్రసాద్ ఓ ఆంగ్ల పత్రికతో తన వ్యక్తిగత జీవితం గురించి ముచ్చటించారు.
ఇందులో భాగంగా పరస్పర అంగీకారంతోనే రోహిత్ మిట్టల్ నుంచి తాను విడిపోయినట్లు తెలిపారు. ‘రోహిత్ నేను భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి స్నేహితులం. పరస్పర ఒప్పందంతోనే మేమిద్దరం విడిపోయాం. అలాగే వృత్తిపరంగా రోహిత్ మిట్టల్‌కు నేను అభిమానిని. ఏదో ఒకరోజు మేమిద్దరం తప్పకుండా కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నాను. ఐదేళ్ల మా రిలేషన్‌లో ప్రేమాభిమానాలను, సంతోషాన్ని పంచుకున్నాం. కానీ, చివరికి మేమిద్దరం విడిపోయి.. స్నేహితుల్లా ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే విడిపోయాం. విడాకుల కోసం కోర్టును సంప్రదించాం. మళ్లీ ప్రేమలో పడనని నేను చెప్పడం లేదు. కానీ, ప్రస్తుతానికి మాత్రం ప్రేమ అనే ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచన అంతా కెరీర్ మీదే’ అని శ్వేతా పేర్కొన్నారు.