హీరోయిన్ శృతి హాసన్ లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టు మైఖెల్ కోర్సేల్‌ను ప్రేమించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. శృతి కోసం మైఖెల్ చెన్నైకి కూడా వచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని మైఖెల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇద్దరూ పరస్పరం చర్చించుకునే ఈ నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. అయితే శృతి తీసుకున్న ఈ నిర్ణయంతో అందరూ షాక్ తిన్నారు. ఆ తర్వాత శృతి తన కొత్త ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. గత కొన్ని రోజులుగా తన సినిమాలు, సంగీత కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు.
మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ షోలో శ్రుతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఆమెను ప్రేమ గురించి ప్రశ్నించారు. మైఖెల్తో విడిపోవడం గురించి ప్రశ్నించగా.. ‘స్వతహాగా నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. చాలా అమాయకురాలిని.. దీంతో నా చుట్టూ ఉన్నవాళ్లు బాస్‌లాగా వ్యవహరిస్తుంటారు. నాకు భావోద్వేగాలు ఎక్కువ. కానీ అతడితో బంధం మాత్రం.. ఓ మంచి అనుభవం. ప్రేమించే వ్యక్తి ఇలా ఉండాలని నాకు నియమాలేమీ లేవు. మంచి వ్యక్తులు మనం సుఖాల్లో ఉన్నప్పుడు మంచి వ్యక్తుల్లానే ఉంటారు. కానీ అదే వ్యక్తులు మన కష్టాల్లో చెడ్డ వ్యక్తులుగా మారుతారు. అలాగని ప్రేమపై నాకు చెడు అభిప్రాయం లేదు, విరక్తీ కలగలేదు. మొత్తానికి ఇది నాకు పాఠం నేర్పింది. నేను గొప్ప ప్రేమికుడి కోసం ఎదురుచూస్తున్నా.. అతడు నాకు ఎదురైనప్పుడు ఇన్నాళ్లు నేను ఎదురుచూసింది ఈ వ్యక్తి కోసమే అని సంతోషంగా వెల్లడిస్తాను’ అని శృతి చెప్పారు.