బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ క్షయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అభిమానికి అండగా నిలిచి తన మంచి మనసు చాటుకున్నారు. సుమయ్య అనే 13 ఏళ్ల బాలిక కొంతకాలంగా క్షయతో బాధపడుతోంది. వ్యాధి మూడో దశలో ఉంది. దాంతో ఆమె కాలేయం కూడా పూర్తిగా దెబ్బతిందని.. శస్త్రచికిత్స నిర్వహిస్తేనే బతికే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సుమయ్య కెట్టో అనే ప్రముఖ ఎన్జీవో సాయంతో చికిత్స పొందుతోంది. ఇదిలా ఉండగా సుమయ్య శ్రద్ధా కపూర్‌కు వీరాభిమాని.
తనకు శ్రద్ధను కలవాలనుందని కెట్టో సిబ్బందికి చెప్పడంతో వారు ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. శ్రద్ధను ట్యాగ్ చేస్తూ సమస్యను వివరించారు. ఇందుకు శ్రద్ధ వెంటనే స్పందించారు. ‘నాకూ తనను కలవాలనుంది. ఎలా కలవాలో చెప్పరూ..’ అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కెట్టో సిబ్బంది శ్రద్ధకు బాలిక వివరాలను పంపారు. అయితే శ్రద్ధ తన అభిమానిని మాత్రమే వ్యక్తిగతంగా కలవాలని, ఆ బాలికతో సమయం గడపాలని అనుకున్నారు. దాంతో అభిమానులు గుర్తుపట్టకుండా ఆమె బుర్ఖా ధరించి ఆ బాలిక చికిత్స పొందుతున్న ఎన్జీవోకు వెళ్లారు.
సుమయ్యతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘బాలికను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె జీవితం చాలా విలువైనది. త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆమె చికిత్సకు కావాల్సిన సాయాన్ని అందిస్తాను. ఎలా సాయపడగలనో వివరించండి. మీ సంస్థ చాలా గొప్ప పని చేస్తోంది’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు శ్రద్ధ.
I’m so so happy that I was able to go & meet Summaya today. She’s such a precious little angel. Praying for her recovery. @ketto please let me know how I can help with her treatment & all the best with all the work you guys are doing ❤️ pic.twitter.com/wmFIU47YQs
— Shraddha (@ShraddhaKapoor) January 29, 2019