భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. గురువారం మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఈ దాడికి పాల్పడ్డాడు. అనూహ్య ఘటనతో జీవీఎల్ నిర్ఘాంతపోయారు.
భోపాల్ అభ్యర్థిగా బీజేపీ తరఫున ప్రజ్ఞాసింగ్‌ను ప్రకటించిన అనంతరం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు జీవీఎల్ గురువారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కాన్పూర్‌కు చెందిన వైద్యుడు శక్తి భార్గవ్ జీవీఎల్‌పైకి చెప్పు విసిరాడు. వెంటనే అక్కడే ఉన్న పార్టీ కార్యాలయ సిబ్బంది అతడిని పట్టుకుని బయటకు తరలించారు. ఇలాంటి దాడులకు తాను భయపడబోనని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లే ఇలాంటి దాడులు చేస్తారని ఆరోపించారు. చెప్పువేసిన వ్యక్తిపై తీవ్ర స్థాయిలో కార్యాలయ సిబ్బంది దాడిచేశారు. చెప్పు విసరడానికి గల కారణాలు తెలియరాలేదు.