HomeTelugu Newsటీడీపీకి షాక్‌ .. బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు

టీడీపీకి షాక్‌ .. బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు

6 21టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావు బీజేపీలో చేరారు. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా వారికి పార్టీ కండువా వేసి పుష్పగుచ్ఛంతో కమల దళంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా నాయకత్వం నచ్చి టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే వీరు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. బీజేపీ సానుకూల రాజకీయాలతో ముందుకెళ్తోందని, టీడీపీ నేతల చేరికతో ఏపీలో బీజేపీ బలం పుంజుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.

ఇటీవల ఎన్నికల్లో జాతి అంతా బీజేపీ వైపే ఉందని తేలిందని.. అప్పుడే తామంతా బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నామని ఎంపీ సుజనా చౌదరి వెల్లడించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో తాను పనిచేసినట్టు గుర్తుచేశారు. సంఘర్షణ కంటే సహకారం ద్వారానే ఏదైనా సాధించుకోగలమని నమ్ముతున్నామన్నారు. విభజన చట్టం పకడ్బందీగా అమలుకు అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. జాతి నిర్మాణంలో భాగస్వాములం అవుతామన్నారు.

దేశ ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో తామూ ప్రజల వెంటే వెళ్తున్నామని ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. వైసీపీ ప్రభుత్వం కూడా బీజేపీతో సఖ్యతగా ఉందన్నారు. విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేసిన తాను మళ్లీ మాతృసంస్థకే వస్తున్నానని టీజీ వ్యాఖ్యానించారు.

ఈ రోజు ఉదయం రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కీలక తీర్మానం చేసింది. రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని తక్షణమే బీజేపీలో విలీనం చేయాలని టీడీపీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడును కోరారు. 10వ షెడ్యూల్‌లోని 4వ పేరా నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని ఉపరాష్ట్రపతిని కోరిన నేతలు.. కాసేపటికే బీజేపీ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని దేశాభివృద్ధి, అభివృద్ధి రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నామని ఎంపీలు పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu