కన్నడ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో శాండల్‌వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రముఖ జర్నలిస్టు, కాలమిస్ట్ శోభాడే ట్విట్టర్ వేదికగా చిరంజీవి సర్జాకు నివాళులర్పిస్తూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫొటో షేర్ చేశారు. ‘మరో షైనింగ్ స్టార్ వెళ్లిపోయాడు. ఎంత నష్టం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ చేశారు. అసలైన చిరంజీవి సర్జా ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేశారు. కానీ ఫొటో మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఫొటోను పోస్ట్ చేశారు. దాదాపుగా 20 పుస్తకాలు రాసిన శోభా డే మెగాస్టార్ ఫొటోను షేర్ చేయడం చర్చనీయాంశమైంది.
అయితే ఈ ట్వీట్‌ను తన ఖాతా నుంచి తొలగించినప్పటికీ అప్పటికే అది కాస్తా వైరల్ కావడం అది చూసిన అభిమానులు, దక్షిణాది అంటే మీకు చులకనా అంటూ ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. పొరపాటు జరిగితే తొలగించడం సరికాదు.. క్షమాపణలు చెప్పి గౌరవాన్ని నిలుపుకోవాలని.. ఓ స్టార్ హీరో ఫొటో షేర్ చేసేటప్పుడు ఆమాత్రం చూసుకోనవసరం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతపెద్ద స్థాయిలో ఉన్న మీరే ఇలా చేస్తే ఎలా అని విరుచుకుపడుతున్నారు. అయితే తక్షణమే చిరంజీవికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
చిరంజీవి సర్జా ఫొటో స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఫొటో షేర్ చేసిన శోభా డే