టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. నిన్న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. శ్రీకార్తీక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్‌గా కనిపించగా, అమల అక్కినేని కీలక పాత్రలో నటించారు .
తాజాగా ఈ సినిమా.. ‘థ్యాంక్యూ మీట్’ ను ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ పై శర్వానంద్ మాట్లాడుతూ .. “ఈ సినిమాను జనంలోకి తీసుకుని వెళ్లిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నాలుగైదేళ్లుగా నాకు హిట్ లేదు .. హిట్ లేకపోతే ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. థియేటర్స్ లో ఈ సినిమాకి వస్తున్న స్పందన చూశాక హమ్మయ్య అనుకున్నాను.
నా చుట్టు పక్కనున్న వాళ్లంతా ఈ సారి నేను సక్సెస్ కొట్టాలని అనుకున్నారు .. అక్కడే నేను సక్సెస్ అయ్యాను. శ్రీకార్తీక్ ఇలాంటి కథలు ఎప్పుడు రాసినా చేయడానికి రెడీగా ఉన్నాము. అమలగారి పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇకపై ఆమె వరుస సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.