సూపర్ స్టార్ రజనీకాంత్ ‘2.ఓ’ సినిమా చిత్రీకరణ సమయంలో తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్ ఓ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చెన్నైలోని మహాబలిపురం రోడ్డులో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా రజనీకి ప్రమాదం జరిగిందట. ‘షాట్ సిద్ధమయ్యాక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా షాట్ పూర్తిచేసేయాలని రజనీ చెప్పారు. ఆ సమయంలో రజనీ మెట్లపై నుంచి జారి పడ్డారు. దాంతో ఆయన మోకాలికి తీవ్ర రక్తస్రావమైంది. కానీ దీని గురించి నాకు ఎవ్వరూ చెప్పలేదు. నేను సెట్స్‌కు వచ్చాక రజనీ నావద్దకు వచ్చి ‘అంతా సిద్ధమే కదా?’ అని అడిగారు. నేను ఆయనకు సన్నివేశం గురించి వివరించి చెప్పాను. ఆ తర్వాత ఆయన మేకప్ రూంకి వెళ్లిపోయారు. ఆ సమయంలో సెట్స్‌లోని వారంతా ఏదో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు.’
‘అప్పుడు రజనీ మేనేజర్ నా వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారు. అది విని నేను షాకయ్యాను. రజనీ షాట్ చేయలేరనిపించింది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నాం. కానీ రజనీ మాత్రం ఆస్పత్రికి వద్దన్నారు. చిత్రీకరణ పూర్తిచేయాలని పట్టుబట్టారు. మేం బతిమాలితే.. ఒక్క షాట్ పూర్తిచేసి ఆస్పత్రికి వెళ్తానని చెప్పారు. ఆయన్ని చికిత్స నిమిత్తం తరలించాక మాకు తెలిసిన విషయం ఏంటంటే.. ఆయన మోకాలికి పెద్ద దెబ్బేతగిలింది. దాంతో నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కానీ రజనీ ఒప్పుకోలేదు. చిత్రీకరణ పూర్తిచేయాలని చెప్పారు. ఓ ఆర్టిస్ట్‌గా రజనీకి పని పట్ల ఉన్న నిబద్ధతను చూసి నాకు ముచ్చటేసింది.’ అని వెల్లడించారు దర్శకుడు శంకర్.