రోబో చిత్రానికి కొనసాగింపుగా రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘2.0’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో రజనీకాంత్, విలన్‌గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించారు. అయితే ఇందులో విలన్ పాత్ర ఎంపికపై చేసిన కసరత్తును శంకర్ తాజాగా అభిమానులతో పంచుకున్నారు.
తొలుత ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు హాలీవుడ్ దిగ్గజ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ను ఎంపిక చేయాలని మూవీ యూనిట్ నిర్ణయించింది. ఈ చిత్రంలో నటించేందుకు ఆయన ఎంతో ఆసక్తి చూపారు. ఆర్నాల్డ్‌తో దాదాపు చిత్రీకరణ ఖాయమనుకున్న సమయంలో వివిధ కారణాలతో ఆయన తప్పుకున్నారని చెప్పారు. అక్షయ్ కుమార్‌ను ఎంపిక చేసే ముందు విలక్షణ నటుడు కమల్ హాసన్‌ను ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు శంకర్ తెలిపారు. ‘ప్రతినాయకుడి పాత్ర కోసం ఆర్నాల్డ్ తర్వాత కమల్ హాసన్‌ను సంప్రదించాం. రజనీకాంత్‌నూ, కమల్‌హాసన్‌నూ ఒకే తెరపై చూడాలనే కాంక్ష నెరవేరుతుందనుకున్నాం. ఇందుకోసం నేనూ, చిత్ర మాటల రచయిత జయమోహన్ దీనిపై చర్చించి ఆయన్ను కలిశాం. కానీ కమల్ నాతో భారతీయుడు-2 చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపారు. దీంతో అక్షయ్ కుమార్‌ను ఎంపిక చేశాం’ అని ఓ ఇంటర్వ్యూలో శంకర్ వెల్లడించారు.