దక్షిణాదిలో బీగ్రేడ్ చిత్రాలకు పెట్టింది పేరైన షకీలా కొంత కాలంగా ఆర్థికపరంగా సమస్యలు ఎదుర్కొంటుంది. రెండేళ్ల క్రితం ‘లేడీస్ నాట్ అలౌడ్’ అనే అడల్ట్ చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమా కోసం తన ఆస్తులను అమ్మడంతో పాటు అప్పులు కూడా తెచ్చి నిర్మించినట్టు తెలిపింది. మగాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాలంటూ ప్రచారం చేసి సెన్సార్ కు వెళ్లింది. అయితే సినిమాకు సెన్సార్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారించలేదు.
ఏడాదిన్నరకు పైగా సెన్సార్ కోసం షకీలా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కరోనా కారణంగా సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యింది. సినిమా మూడు నెలల్లోనే పూర్తిచేసినా విడుదలకు మాత్రం రెండేళ్లకు పైగా పట్టింది. అయినా థియేటర్లలో విడుదల చేయలేని పరిస్థితి ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని డిజిటల్ ఫార్మట్ లో విడుదల చేసింది. ఈ చిత్రాన్ని చూసి నన్ను బతికించండి అంటూ కొన్ని రోజుల క్రితం విజ్ఞప్తి చేసిన షకీలా తాజాగా మరో వీడియో సందేశాన్ని పంపించింది.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న తాను సినిమా ప్రమోషన్ కోసం రాలేక పోయానని చెప్తోంది. కాస్త అనారోగ్యంగా ఉండటం వల్ల ఆసుపత్రిలో చేరాను. మీరంతా సినిమాను చూస్తారని ఆశిస్తున్నాను అని విజ్ఞప్తి చేసింది. నిన్న విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తున్నట్లుంది.