హీరో విశాల్, తమన్నా జంటగా రూపొందిన ‘యాక్షన్’ సినిమా కారణంగా తాము నష్టపోయామంటూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది నవంబర్‌లో యాక్షన్ పేరుతో విడుదలైన విశాల్ మూవీ సుందర్ సి. దర్శకత్వంలో ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్నంతగా ఫలితం రాలేదు. ఈ చిత్రాన్ని ముందుగా తక్కువ బడ్జెట్‌లో నిర్మించాలనుకున్న నిర్మాతలకు హీరో విశాల్ భరోసా ఇచ్చారట. ఈ చిత్రానికి కనీసం రూ. 20 కోట్ల వసూళ్లు రాకపోతే ఆ నష్టాన్ని తాను భరిస్తానని చెప్పాడట. దాంతో ఆ చిత్ర నిర్మాతలు రూ. 44 కోట్లు వెచ్చించి యాక్షన్ చిత్రాన్ని నిర్మించారు. కానీ ఆ చిత్రం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం రూ. 12 కోట్ల లోపు వసూళ్లు మాత్రమే రాబట్టగలిగింది. దీంతో యాక్షన్ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు హీరో విశాల్ డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. నష్టాన్ని భర్తీచేసేలా రూ. 8.29 కోట్లకు హీరో విశాల్ గ్యారెంటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.