సీనియర్ నటి శివ పార్వతి కరోనా బారి నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. శివపార్వతి తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె కరోనా బారిన పడి ఆస్పత్రిలో ఉంటే ఎవరూ తనను పట్టించుకోలేదని ఆరోపించారు. తాను కీలక పాత్రలో నటిస్తున్న వదినమ్మ సీరియల్ నిర్మాత ప్రభాకర్ కూడా తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ ఎవరికి ఎవరూ తోడు ఉండరని అర్థమైంది. కరోనాతో నేను గుణపాఠం నేర్చుకున్నాను, ఎవరు ఎలాంటి వారో అర్ధమైంది అంటూ తీవ్ర ఆవేదన చెందారు.
శివపార్వతి ఆరోపణలపై నటుడు ప్రభాకర్ స్పందిస్తూ ఇదంతా ఓ చిన్న పొరపాటు వల్లే జరిగిందని ఓ వీడియో పోస్ట్ చేశారు. నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ మాట్లాడలేదు, వాళ్ల అబ్బాయి మాట్లాడాడు. ఇవన్నీ అమ్మకు పెద్దగా తెలియకపోవడం వల్ల చిన్న మిస్ అండర్ స్టాండింగ్ జరిగి బాధపడి, వీడియో రిలీజ్ చేశారు అన్నారు. అమ్మ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ విషయంపై మాట్లాడతాను అన్నారు. శివ పార్వతమ్మ తనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని అపార్థం చేసుకోవడం వల్లే ఇలా జరిగిందని తెలిపారని అన్నారు. అమ్మకు ఏ అవసరం వచ్చినా చూసుకోడానికి మేమున్నాం, ఎప్పటికీ ఉంటాం కూడా! అమ్మే కాదు, ఇండస్ట్రీలో ఎవరికి ఏం ఆపద వచ్చినా అందరం సాయం చేస్తాం అన్నారు ప్రభాకర్. శివ పార్వతి అమ్మకు కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చేంతవరకు సహాయపడ్డ మా ఇండస్ట్రీ గొప్ప వ్యక్తులకు, ముఖ్యంగా శివబాలాజీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, జీవితా రాజశేఖర్, ఇంకా ఎవరెవరు ముందుకొచ్చి అమ్మకు సహాయపడ్డారో వాళ్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అని తెలిపారు ప్రభాకర్.