బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఎన్నో కీలక అంశాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సుశాంత్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచారణ జరుగుతోంది. మరోవైపు ఈడీ అధికారులు, పోలీసుల విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్యకు ముందు రోజు సుశాంత్ బెడ్‌రూం లాక్‌ను తానే పగలగొట్టినట్టు తాళాలు రిపేర్ చేసే వ్యక్తి మహ్మద్ రఫీ పోలీసులు విచారణలో అంగీకరించాడు. అందుకోసం రూ. 2 వేలు ఇచ్చారని తెలిపాడు.
సుశాంత్ ఆత్మహత్యకు ముందు రోజు మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో గది తాళం పగలగొట్టాలని తనకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపాడు. అయితే ఆ గదిలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తనకు తెలియదని అన్నాడు. ఆ సమయంలో గదిలో నలుగురు ఉన్నారని వారిలో ఎలాంటి కంగారు కనిపించలేదని తెలిపాడు. డోర్ తెరుచుకున్న వెంటనే వారు తనకు డబ్బులిచ్చి సామాన్లు తీసుకుని వెంటనే వెళ్లిపోవాలని ఆ వ్యక్తులు చెప్పినట్లు తెలిపాడు. ఈ కేసులో తాను సీబీఐకి సహకరిస్తానని రఫీ పేర్కొన్నాడు.
మరోవైపు సుశాంత్ కేసును సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆయన పొస్టుమార్టం రిపోర్టును పరిశీలించేందుకు సీబీఐ నలుగురు ఎయిమ్స్ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. డాక్టర్ సుధీర్ గుప్తా నాయకత్వంలో ఆ బృందం సుశాంత్ రిపోర్టును పరిశీలించి దానిపై స్పష్టమైన నివేదిక ఇవ్వనున్నారు. సుశాంత్ స్నేహితులు నీరజ్, సిద్ధార్థను కూడా సీబీఐ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేసు తుది నివేదికను అందచేస్తామని కూడా సీబీఐ చెప్పినట్లు తెలుస్తోంది.